ఏపీలో ఇళ్లు, భూములు కొనే వారికి గుడ్ న్యూస్..!
ఈ రోజుల్లో భూములు కానీ ఇళ్లు కానీ కొనాలంటే దాని చట్టబద్ధత ప్రధాన సమస్యగా మారింది. వందల ఎకరాల్లో లేఅవుట్లు వేసేసి, వాటిని వినియోగదారులకు అమ్మేసి చేతులు దులుపుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. దీంతో ఆ తర్వాత వీటిని కొనుగోలు చేసి అక్రమమని తేలితే గగ్గోలు పెడుతున్న వారు అంతకంటే ఎక్కువగా ఉంటున్నారు. ఈ సమస్యను నివారించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో సమస్యగా మారిన అక్రమ లేవుట్ల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు కార్పోరేషన్ లో జరిగిన పురపాలకశాఖ సమీక్షలో మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. ఇకపై అక్రమ లేఔట్ల భరతం పడతామని ఆయన తెలిపారు. ముఖ్యంగా స్థలం కొనుగోలుదారులు అప్రూవ్డ్ లేఔట్ లోనే స్థలాలను కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.

తాత్కాలికంగా అధికారుల్ని మభ్యపెట్టి భవనాల నిర్మాణం చేస్తే ఇబ్బందులు తప్పవని మంత్రి నారాయణ హెచ్చరించారు.
లేఅవుట్ల విషయంలో అనేక సమస్యలు ఉన్నాయని, రాష్ట్రపట్టణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ విద్యుల్లత సూచనలతో కొన్నిటిని పరిష్కరించామని మంత్రి నారాయణ తెలిపారు. బిల్డింగ్ అప్రూవల్ పై ఇప్పటికే అనేక నిబంధనలను సడలించామని,
లైసెన్స్ సర్వేయర్లు ఇంజనీర్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు.
అలాగే త్వరలో అప్రూవ్డ్, నాన్ అప్రూవ్డ్ లేఔట్ ల పై యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. అనధికార లేఔట్లలో మాత్రం స్థలాలు కొనుగోలు చెయ్యొద్దని ఆయన సూచించారు. ఈ యాప్ ద్వారా ఏది అక్రమమూ, ఏది సక్రమమూ తెలుస్తుందన్నారు. దాన్ని బట్టి సరిచూసుకుని కొనుగోళ్లు చేయాలని మంత్రి సూచించారు. పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలపై తాజాగా చర్చించి పరిష్కారాలు చూపుతున్నామన్నారు. మార్ట్ గేజ్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఒక ఉద్యోగిని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో మార్ట్ గేజ్ లను రిలీజ్ చేసే విధంగా కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ శాఖల్ని అనుసంధానం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications