ఏపీలో కొత్తగా 2260 స్పెషల్ టీచర్ పోస్టులు-ప్రభుత్వం జీవో జారీ..!
ఏపీలోని పాఠశాలల్లో ప్రస్తుతం అవసరమైన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల సృష్టి కోసం ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ లేదా క్లాసుల కోసం ఈ టీచర్లను కేటాయిస్తారు. ఈ మేరకు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ విభాగాల్లో కలిపి మొత్తం 2260 స్పెషల్ టీచర్ పోస్టుల్ని సృష్టించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ కు ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో 1136 ఎస్జీటీ పోస్టులు, 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వాస్తవానికి స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 1984 పోస్టులు అవసరం ఉండగా.. ఇందులో ఇప్పటికే 860 పోస్టులు ఉన్నాయని, ఇప్పుడు మరో 1124 పోస్టులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ పోస్టుల్ని ఉమ్మడి జిల్లాల వారీగా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో వివరాలు తెలిపింది. ఎస్జీటీల్లో అత్యధికంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 151 ఖాళీలు ఉండగా...అత్యల్పంగా విజయనగరంలో 45 పోస్టులున్నాయి. స్కూల్ అసిస్టెంట్లలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 151 పోస్టులు ఉండగా.. అత్యల్పంగా కడపలో 49 పోస్టులున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి టీచర్ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను కూడా కలిపి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులు వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది.












Click it and Unblock the Notifications