ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక తెలుగులోనూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ఇంగ్లీష్, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ మేరకు వివిధ శాఖలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
మొదట ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు ఇచ్చి అప్‌లోడ్ చేయాలని.. ఆ తర్వాత రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వులు జారీకి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది. ఉత్తర్వుల అనువాదానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ సేవలు వినియోగించుకోవాలని జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

పాలనా వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభ తీర్మానించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలావుండగా, హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహా సభలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలెడ్జ్ ఎకనాలో తెలుగువారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని అన్నారు. ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలన్నారు.
ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభయ్యాయని గుర్తు చేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు.. శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒక్కటేనని అన్నారు. అదే తెలుగు జాతి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఏపీ, ఆస్ట్రేలియా, అమెరికా.. ఇలా ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి తెలుగువారు వచ్చారన్నారు. కాగా, ప్రపంచ తెలుగు సమాఖ్యకు 1993లో శ్రీకారం చుట్టగా.. తొలి మహా సభలు 1996లో హైదరాబాద్‌లో జరిగాయి.












Click it and Unblock the Notifications