ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కార్ మరో కీలక అడుగు వేయబోతోంది. ఇందులో భాగంగా తాజాగా సచివాలయాల ఉద్యోగుల నుంచి వచ్చిన ఓ డిమాండ్ ను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అసలు ప్రక్రియ ప్రారంభం కానుంది.
రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు బదిలీల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే ప్రభుత్వానికి సమర్పించిన డిమాండ్ల జాబితాలోనూ బదిలీల డిమాండ్ ఉంది. దీంతో ప్రభుత్వం వీరి బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సచివాలయాల్లో ఉద్యోగులు ఎంతో కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఉద్యోగులకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే బదిలీలు జరిగిపోతే పిల్లల చదువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి అతి త్వరలో హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం సచివాలయ ఉద్యోగులకు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇలా బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 16 వరకూ గడువు ఇస్తారని సమాచారం.
అనంతరం ఈ నెల 22 నుంచి నిబంధనల ప్రకారం సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. సచివాలయాల యూజర్ మాన్యువల్ ప్రకారం బదిలీల్లో పలు అంశాలను ప్రాధాన్యతగా ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది. ఇందులో మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ గ్రౌండ్స్, దివ్యాంగులు, తల్లిదండ్రులు ఆరోగ్య పరంగా పిల్లలపై ఆధారపడి ఉన్నవారు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకంటే ఎక్కువ కాలం విధులు నిర్వహించి ఉండటం, కారుణ్య నియామకాల కింద నియామకాలు పొందిన మహిళలకు బదిలీల్లో ప్రాధాన్యత ఉండొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications