ఏపీకి భారీ వర్షసూచన-బంగాళాఖాతంలో అల్పపీడనం-అల్లకల్లోలంగా సముద్రం
ఏపీలో గత రెండు రోజులుగా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీని కారణంగా ఏపీ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేస్తోంది.
Recommended Video
రాగల 24 గంటల్లో వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ ఈరోజు , రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ కూడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగానే ఉంది. పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. రేపు కూడా వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో ప్రభుత్వం అధికారుల్ని అప్రమత్తం చేస్తోంది. రేపు భారీగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అధికారుల్ని తీర ప్రాంతాల్లో ఉన్న మత్సకారులతో సహా అందరినీ అప్రమత్తం చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వచ్చినప్పటికీ అనుకున్న స్ధాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో చాలా చోట్ల పంటలు వేసుకునేందుకు రైతులకు అవకాశం దక్కడం లేదు. మరికొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందన్న వార్తలు వారిని కలవరపెడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం రేపు లేదా ఎల్లుండి వరకూ మాత్రమే వర్షాలు ఉండొచ్చని చెబుతోంది.












Click it and Unblock the Notifications