దిశ చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు: ప్రతీ బస్ స్టాప్ లో మహిళా ఎస్సై: దిశ పేరుతో కంట్రోల్ రూం..!
దేశంలో తొలిసారిగా దిశ చట్టం చేసిన ఏపీ ప్రభుత్వం..ఇప్పుడు అమలు దిశగా చర్యలు ప్రారంభించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో దిశ చట్టంను ఆమోదించారు. ఈ చట్టం ను తాము అమలు చేస్తామంటూ ఢిల్లీ..ఒడిశా ప్రభుత్వాలు ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ..చట్టం చేసిన వివరాలను పంపాలని కోరారు. ఇక, దీని పైన చర్యల దిశగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది.
దీనికి సంబంధించి అమలు కోసం రూ. 87 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలు..బాలలపై లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగాఈ నిధులు మంజూరు చేశారు. ఈవ్ టీజింగ్...వేధింపుల నిరోధం కోసం ప్రతీ బస్ స్టాప్ కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ కాల్ సెంటర్..యాప్ అందుబాటులోకి..
ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ చట్టం అమల్లోకి తెస్తూ..ప్రభుత్వం ఆ దిశగా నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ 87 కోట్లు నిధులను రాష్ట్రంలో మహిళా పోలీసుస్టేషన్ల ఉన్నతీకరణ, ఫోరెన్సిక్ ప్రయోగశాలల బలోపేతం... ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు.. దిశ కాల్‌సెంటర్.. యాప్‌ల కోసం వినియోగించనున్నారు.
అదే విధంగా.. విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్ఏ , సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేయనున్నారు. ఇక నుండి..డయల్ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి దాన్ని దిశ కంట్రోల్ రూంగా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతీ బస్ స్టాప్ లో మహిళా ఎస్సై...
దిశ యాప్ కోసం కోటి 26 లక్షల రూపాయలను వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. రాష్ట్రంలో కొత్తగా.. ప్రతి బస్‌స్టాప్ సెంటర్‌కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేశారు. దీని ద్వారా ఆ పరిధి లె యువతులను ఈవ్ టీజింగ్..వేధింపులు..బస్సుల్లో ఆకతాయిలను నిరోధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇక, దిశ ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీసుస్టేషన్ సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నారు. చట్టంలో పేర్కొన్న విధంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి..సరైన ఆధారాలు ఉంటే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వం నిర్ధేశించింది. దీని కోసం బాధితులకు అండగా.. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు.












Click it and Unblock the Notifications