ఏపీలో కొత్తగా ఆరు జిల్లాలు - పేర్లు, సరిహద్దుల మార్పు..!?
ఏపీలో కొత్తగా ఆరు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. పలు జిల్లాల పేర్లతో సహా.. సరిహద్దుల మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. మండలాల విషయంలోనూ అభ్యంతరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగా మంత్రివర్గ ఉప సంఘం వినతుల ను స్వీకరించాలని నిర్ణయించింది. వీటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. రాష్ట్రం లో కొత్త జిల్లాలు.. మండలాల పైన వచ్చే నెల అధికారికంగా నిర్ణయం వెల్లడి కానుంది.
ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు 32కి పెరగనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు పైన ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం నియమించింది. ఈ నెల 13న సచివాలయంలో తొలి భేటీ కానుంది. జిఒఎంలో సభ్యులుగా ఉన్న మంత్రి అనగానితో పాటు నారాయణ, అనిత, బిసి జనార్ధన్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ అదేరోజు సచివాలయంలో అందుబాటులో ఉండనున్నారు. ఇదే సందర్భంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మేధావుల నుంచి జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాలపై వినతులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

రాష్ట్రంలో 6 కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయ. ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, రాజంపేట మారనున్నట్లు తెలిసింది. ఇందులో ఒకట్రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉండొచ్చు. గత వైసిపి పాలనలో కొన్ని జిల్లాల పేర్లు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, మండలాల విలీనంతోపాటు భౌగోళిక అంశాల ఎంపిక ప్రక్రియ లోప యిష్టంగా జరిగిందని కూటమి ప్రభుత్వం పలు సందర్భాల్లో విమర్శించింది. తాము అధికారంలోకి వస్తే లోపాలను సరిచేస్తామని సిఎం చంద్రబాబు ఎన్నికల పర్యటనల్లో హామీనిచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ నెల 6న జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా లోపాలను సరిచేసి, సూచనలతో కూడిన నివేదికను నెలలోగా ఇవ్వాలని సిఎం ఆదేశించారు.
కాగా, ప్రస్తు0 ఉన్న 26 జిల్లాలు 32కు పెరగనున్నట్లు తెలిసింది. అలాగే పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లు ఉండే అవకాశం ఉంది. ఇక.. రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది.












Click it and Unblock the Notifications