జగన్ చేసినట్లు చేయలేం - పథకాల అమలుపై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం ఆర్దిక పరిస్థితులను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అమరావతి, పోలవరం కు ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్రం ఈ రెండు ప్రాజెక్టులకు తాజాగా సహకారం అందిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కేంద్రం నుంచి వచ్చే ప్రతీ రూపాయిని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇతర పథకాల కోసం వచ్చిన రుణాలను సంక్షేమ పథకాలను మళ్లించలేమని ఏపీ ఆర్దిక శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
సద్వినియోగం దిశగా
ఏపీకి కేంద్రం నుంచి అమరావతికి ప్రకటించిన రుణం పైన రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పారు. ఈ రూ.15,000 కోట్లను కేంద్రం ఈఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుందని తెలిపారు. తిరిగి ఆ అప్పును పూర్తిగా 100 శాతం కేంద్రమే చెల్లిస్తుందని స్పష్టంచేశారు. దీనికి సంబంధించి రాష్ట్రంపై ఎలాంటి భారం పడబోదని చెప్పారు. గత ఐదేళ్లలో నిర్వీర్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి గాడిలో పెడుతున్నట్టు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి తీసుకొచ్చి సద్వినియోగం చేస్తామన్నారు.

తక్కువ వడ్డీకే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు వాడుకోవడానికి కేంద్రం ఇచ్చిన అప్పుల అనుమతి రూ.47,000 కోట్లు దాదాపు పూర్తి కావొచ్చిందని తెలిపారు. అక్టోబరు-డిసెంబరు కాలానికి మరో 0.5 శాతం అంటే రూ.8,000 కోట్లకు అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇది కాకుండా చివరి త్రైమాసికంలో మరికొంత అప్పునకు కేంద్రం అనుమతిస్తుందని పేర్కొన్నారు. ఈఏపీల ద్వారా తీసుకున్న రుణాలు చాలా ఖరీదయ్యాయని, 9-10 శాతం వడ్డీ పడుతోందని చెప్పారు. విదేశీ కరెన్సీతో పోల్చితే రూపాయి విలువ తగ్గడంతో ఆ రుణాలు ఖరీదయ్యాయని చెప్పారు. ఆర్‌బీఐ, నాబార్డు, జైకా, ఏడీబీ నుంచి ఇంకా తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఆ పొరపాట్లు చేయం
గత ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చి పథకాల కోసం భారీగా నిధులు మళ్లించిందని, ఆ తప్పు తాము చేయబోమని చెప్పారు. కార్పొరేషన్లు వాటి అవసరాల మేరకు అప్పులు తెచ్చుకుని వాడుకుంటాయని తెలిపారు. ఐదేళ్ల పాటు పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను ఒక్కరోజులో చెల్లించలేమని, దీనికి చాలా సమయం పడుతుందని పీయూష్ కుమార్ అన్నారు. ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలోని వివరాల ప్రకారం రూ.1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులున్నాయని, వీటిని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తిగా చెల్లించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఖజానాకు ఆదాయం పెంచడంతో పాటు ప్రభుత్వ ఖర్చులు కూడా తగ్గించుకుంటామని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications