మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారానికి చెక్ - మరోసారి తేల్చిచెప్పిన ఏపీ సర్కార్..!
ఏపీలో గతేడాది నిర్వహించిన మెగా డీఎస్సీలో (mega dsc) అక్రమాలు జరిగిపోయాయంటూ విపక్ష వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాలకు కూటమి సర్కార్ (AP govt) మరోసారి ఆధారాలతో చెక్ పెట్టింది. డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచీ ఉద్యోగాల భర్తీ వరకూ సాగిన ప్రక్రియను వివరిస్తూ మరోసారి వివరణ విడుదల చేసింది. ఇందులో డీఎస్సీ అక్రమాల పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ఎలా జరిగిందో వివరించింది.
మెగా డీఎస్సీ-2025పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. డీఎస్సీ ప్రకటన ఇచ్చిన తర్వాత నుంచీ తుది ఎంపిక వరకు మొత్తం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే నిర్వహించామని వెల్లడించింది. టీసీఎస్, అయాన్ డిజిటల్ ప్లాట్ ఫామ్, 256 బిట్ ఎన్ క్రిప్షన్ , ర్యాండమైజేషన్ వంటి అత్యాధునిక భద్రతా వ్యవస్థలతో పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈసారి డీఎస్సీ పరీక్షలో 42 వేల ప్రశ్నల బ్యాంక్, పరిమిత యాక్సెస్, బహుళ భద్రతా చర్యల వల్ల పేపర్ లీక్‌కు అసలు అవకాశం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మూడు స్థాయిల ఫిర్యాదుల పరిశీలన వ్యవస్థ ద్వారా వేలాది అభ్యర్థుల ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించినట్లు కూడా తెలిపింది. మెరిట్ లిస్టులు, ఆన్సర్ కీలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. రికార్డు స్ధాయిలో 16347 ఉద్యోగాలను కేవలం 148 రోజుల్లో భర్తీ చేసినట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల కృషిని అవమానించేలా తప్పుడు ప్రచారాలు చేయడం బాధ్యతారాహిత్యమని ప్రభుత్వం విమర్శించింది. గత ప్రభుత్వంలో మెగా డీఎస్సీ హామీలు అమలు కాలేదని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చిందని గుర్తుచేసింది. మెగా డీఎస్సీపై ఎంత ప్రచారం జరిగినా, మొత్తం నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రతి దశ రికార్డుల్లోనే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications