DSC-2025 కౌన్సిలింగ్, నియామకాలపై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం డీఎస్సీ -2025 నియామక ప్రక్రియ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మెరిట్ జాబితా విడుదల చేసిన విద్యాశాఖ రేపటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనుంది. రిజర్వేషన్ల ఆధారంగా అధికారులు కటాఫ్ మార్కులను నిర్ణయించారు. డీఎస్సీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 1:1 విధానంలో కాల్‌లెటర్లు ఇవ్వనున్నారు. వెబ్‌సైట్‌లోని అభ్యర్థుల లాగిన్‌లో ఈ రోజు కాల్ లెటర్లను అందుబాటులో ఉంచనున్నారు. వచ్చే నెల తొలి వారంలో కౌన్సిలింగ్ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రభుత్వ వేగవంతం చేసింది. రేపు (సోమవారం) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించి.. మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత డీఎస్సీ మెరిట్ జాబితాలో ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయనున్నారు. ఎంపికైన వారు వచ్చే నెల రెండో వారంలో పాఠశాలల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ రూపొందించింది. ఈ ప్రక్రియ పరిశీలన బాధ్యతలను ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులకు అప్పగించారు. వారు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తారు. కాగా, టెట్ ఒక సబ్జెక్టు , డీఎస్సీ మరో సబ్జెక్టు రాసిన వారి ఫలితాలను నిలిపివేశారు.

కొంత మంది అభ్యర్ధులు తెలుగు భాష టెట్ రాసి, ఉర్దూ పరీక్ష రాసినట్లు తేలింది. కొందరు సాధారణ సబ్జెక్టులకు టెట్ రాసి, ప్రత్యేక విద్య పోస్టులకు డీఎస్సీ రాశారు. వాస్తవంగా వీరు టెట్ రెండో పేపర్ రాయాల్సి ఉంటుంది. మరికొందరు సాంఘికశాస్త్రానికి టెట్ , గణితం సబ్జెక్టుకు డీఎస్సీ రాశారు. మరికొందరు అర్హత పరీక్షలు ఉత్తీర్ణులు కాకుండానే డీఎస్సీకి హాజరయ్యారు. దరఖాస్తు సమయం నాటికే కోర్సులు పూర్తి చేయాలనే నిబంధన ఉన్నందున ఇలాంటి వారి ఫలితాలను నిలిపివేశారు. ఎస్జీటీ జిల్లాస్థాయి పోస్టులకు ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు రాష్ట్ర టాపర్లుగా నిలిచారు. ఇవి జిల్లాస్థాయి పోస్టులు కావడంతో జిల్లాలోని పోస్టులు, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ ఉంటుంది. డీఎస్సీలో కొందరు ఒకటి, రెండు, మూడు పోస్టులకు సంబంధించి టాపర్లుగా నిలిచారు. వీరికి మూడు ఉద్యోగాలూ వస్తాయి.
అయితే, దరఖాస్తు సమయంలో పోస్టులకు ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే వారు జాబ్ పొందాలి. మూడు పోస్టులకు అర్హత సాధించినా, దరఖాస్తు సమయంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చిన జాబ్ కే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సెప్టెంబర్ తొలి రెండో వారంలోనూ పూర్తి స్థాయిలో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications