ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వారి డిమాండ్లకు అంగీకరించింది. తొమ్మిది శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు తమ అంగీకారాన్ని తెలియజేశారు.
ఫలితంగా ఈ రాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగులు నిర్వహించ తలపెట్టిన నిరవధిక సమ్మెను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో- ఈ రాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయాలని విద్యుత్ శాఖ ఉద్యోగులు నిర్ణయించిన విషయం తెలిసిందే.

వేతనాల పెంపు, ఫిట్‌మెంట్, పేస్కేల్, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దశలవారీగా వారు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దిగారు. నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో బైఠాయింపులు, గేట్ మీటింగులను నిర్వహిస్తూ వచ్చారు. వర్క్ టు రూల్ పద్ధతిలో విధులకు హాజరవుతూ వచ్చారు.
9వ తేదీ నుంచి అంటే ఈ రాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామంటూ ఇదివరకే వారు సమ్మె నోటీసును ఇచ్చారు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్లకు వాటిని అందజేశారు. ఈ సమ్మెను నిలువరించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వచ్చింది. సమ్మెను ఉపసంహరింపజేయడానికి ఇవ్వాళ- ప్రతినిధులతో చర్చలు జరిపింది.
ఈ చర్చలు సఫలం అయ్యాయి. విద్యుత్ ఉద్యోగులకు తొమ్మిది శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ తొమ్మిది శాతం ఫిట్‌మెంట్‌కు ఉద్యోగులు అంగీకరించారు. దీనితో సమ్మె నుంచి విరమించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications