సచివాలయాల సిబ్బంది కుదింపు, సర్దుబాటు - తాజా ఆదేశాలు..!!
ఏపీ ప్రభుత్వం సచివాలయాల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది. వైసీపీ హయాంలో ఏర్పాటైన సచివాలయాలను కొనసాగిస్తూనే సిబ్బంది సేవల విషయంలో మాత్రం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. అవసరమైన మేరకు వారి సేవలను వినియోగించుకుంటూ మిగిలిన సిబ్బంది ని ఇతర శాఖల్లో సర్దుబాటు దిశగా నిర్ణయం తీసుకోనుంది.
ప్రక్షాళన
సచివాలయాల్లో సిబ్బంది సేవలు...సర్దుబాటు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌కి ఆదేశాలిచ్చినట్లు సమచారం.

సర్దుబాటు
ప్రస్తుతం రాష్ట్రంలో 15 వేలకుగా పైగా గ్రామ-వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,34,000 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం 1,26,000 మంది ఉన్నారు. సగటున 8 మందికి పైబడి ఉన్నారు. చాలా సచివా లయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉన్నారు. వీరిలో నలుగురైదుగురిని మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇరిగేషన్‌తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉంది. ఈ ఉద్యోగాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
కసరత్తు
గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా మారాయి. వీటి మధ్య సంబంధాల్లో స్పష్టత లేదు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులు పలు శాఖల ఆదేశాలతో పనిచేస్తున్నారు. ఇదే పరిస్థితి వార్డు సచివాలయాల్లోనూ నెలకొంది. వాటిలోని కార్యదర్శులు ఎక్కువగా మున్సిపల్ శాఖతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ -రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలనే సిఫార్సులు ప్రభుత్వానికి అందాయి. దీంతో, ఇప్పుడు ప్రక్షాళన దిశగా ప్రభుత్వం ప్రక్షాళన దిశగా తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications