సచివాలయాలకు ప్రభుత్వ తాజా ఆదేశాలు - వాలంటీర్ల స్థానంలో...!!
ఏపీ ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనా పరంగా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రతీ కుటుంబానికి సంబంధించి సర్వే చేయించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ప్రతీ ఇంటికి జయో ట్యాగింగ్ తప్పనిసరి చేసింది. సర్వే ఆధారంగా డేట్ బేస్ నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా వార్డు, గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
కుటుంబ సర్వే
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో గ్రామ వలంటీర్ల ద్వారా హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ నిర్వహించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా ఆయా ఇళ్లను జియో మ్యాపింగ్ చేయడంతో పాటు కుటుంబంలోని వారి వివరాలను కూడా సర్వే ఆధారంగా డేటా బేస్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ సర్వేకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తాజా ఉత్తర్వులతో
ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబరు 31న దీపావళి రోజున ఈ అంశం పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాజాగా వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా మార్గదర్శకాలను అమలు చేయనున్నారు. ఉత్తర్వుల్లో ఇంటింటి సర్వే ఎప్పుడు ప్రారంభించాలనేది తేదీ ఖరారు చేయలేదు. అదే విధంగా ఎప్పటి లోగా పూర్తి చేయాలనే అంశాలు ఉత్తర్వుల్లో లేకపోయినప్పటికీ భవిష్యత్తులో సంక్షేమ పథకాల మంజూరు, తొలగింపుపై ఈ సర్వే ప్రభావం పడే అవకాశాలు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు, నూతన పెన్షన్లు, పిఎంఎవై 2.0 గృహాల మంజూరు, స్కిల్ డెవలప్‌మెంట్‌కు అర్హులైన నిరుద్యోగుల జాబితాను ఎంపిక చేయాలని భావిస్తోంది.
వాలంటీర్ల స్థానంలో
వీటితో పాటుగా నిరుద్యోగ భృతికి అర్హులను గుర్తించడంతో పాటు పలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టేలా ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ సర్వే ప్రారంభిస్తున్నట్లు సమాచారం. సంక్షేమ పథకాల లబ్ది దారులు.. అర్హత ఉన్న వారి వాస్తవ సంఖ్య పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కుటుంబ సర్వే బాధ్యతలను గత ప్రభుత్వం వాలంటీర్లకు అప్పగించగా.. ప్రస్తుత ప్రభుత్వం వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. దీంతో, వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది ఇంకా సస్పెన్స్ గానే కనిపిస్తోంది. జనవరి లోగా ఈ సర్వే పూర్తి చేసే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications