కాలగర్భంలోకి జగన్ మానస పుత్రిక - తాజా నిర్ణయంతో..!!
ఏపీ ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జగన్ హాయంలో తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను మార్పు చేస్తోంది. జగన్ పాలనలో ఎక్సైజ్ విధానాన్ని ఇప్పుడు పూర్తిగా మార్పులు చేస్తున్నారు. పాత మద్యం బ్రాండ్లను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు చేయనున్నారు. ఇదే సమయంలో జగన్ తన మానస పుత్రికగా చెప్పుకొన్న స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) కాలగర్భంలో కలిసిపోనుంది.
రద్దు దిశగా
వైసీపీ హాయంలో రూపుదిద్దుకున్న స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోపే ఈ వ్యవస్థను ఎత్తేసి, ఎక్సైజ్ శాఖకు సంపూర్ణంగా పూర్వరూపం తీసుకురానుంది. ఇందుకోసం తాజాగా ఎక్సైజ్ శాఖ తయారుచేసిన ప్రతిపాదనలను సాధారణ పరిపాలన, న్యాయ శాఖల పరిశీలనకు పంపుతున్నారు. ఈ నెల 28న జరిగే కేబినెట్ సమావేశంలో సెబ్ రద్దుకు ఆమోదం తెలుపుతారు. ఆ వెంటనే ఎక్సైజ్ చట్టంలో సవరణలతో ఆర్డినెన్స్ జారీచేసి సెబ్‌ను పూర్తిగా రద్దుచేస్తారు.

ప్రక్షాళన
ఆ తరువాత ఎక్సైజ్, సెబ్‌లలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, కానిస్టేబుళ్లకు కలిపి ఒకేసారి బదిలీలు చేపడతారు. సెప్టెంబరు 5 నుంచి 15లోగా బదిలీలు పూర్తికావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.ఈలోగా వ్యవస్థ మొత్తాన్ని పునర్వ్యవస్థీకరించనుంది. ఎక్సైజ్, సెబ్ రెండు వేర్వేరు విభాగాల్లో ఉన్నందున అధికారులకు జీరో సర్వీసు ప్రామాణికంగా బదిలీలు చేసే అవకాశం ఉంది. కానిస్టేబుళ్లు స్టేషన్లలోనే ఉన్నందున వారికి కొంత సర్వీసును ఆధారంగా తీసుకుని బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
బలోపేతం
ఎక్సైజ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ కీలకంగా ఉంటుంది. రాష్ట్ర, జిల్లా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయుల్లో ప్రత్యేక స్క్వాడ్‌లు ఉంటాయి. సెబ్‌ను రద్దుచేసి ఎక్సైజ్‌ను పాత విధానంలోకి తీసుకొస్తే ప్రధాన కార్యాలయంలో ఒక అదనపు కమిషనర్, ముగ్గురు జాయింట్ కమిషనర్లు ఉంటారు. మొత్తంగా 67 మంది ఇక్కడ ఉంటారు. బేవరేజెస్ కార్పొరేషన్‌లో 36 మంది, డిస్టిలరీ విభాగంలో 302 మంది, జిల్లాల్లో 96 మంది, ఎక్సైజ్ స్టేషన్లలో 3,333 మంది, అసిస్టెంట్ కమిషనర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందా ల్లో 295 మంది, ఈఎస్ టాస్క్‌ఫోర్స్ బృందాల్లో 334 మంది, చెక్‌పోస్టుల్లో 313 మంది, మద్యం డిపోల్లో 138 మంది చొప్పున సిబ్బంది ఉంటారు.












Click it and Unblock the Notifications