అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ పై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!
అంగన్వాడీల బలోపేతానికి తెలంగాణా ప్రభుత్వం కృషి చేస్తుంది. అంగన్వాడీలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి కేంద్రాల్లో 15,982 పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయిలో సాంకేతిక కారణాలు, అధికారుల అలసత్వం కారణంగా ఈ నోటిఫికేషన్ జారీ ప్రక్రియ అనేక చోట్ల ఆలస్యమైంది.
అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియపై మంత్రి సీతక్క
ఈ క్రమంలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియ, అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి తీసుకునే చర్యలపై మంత్రి సీతక్క చర్చించారు. సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించి అంగన్వాడీల విషయంలో కీలక సూచనలు చేశారు. అంగన్వాడీ లలో జిల్లాల వారీగా టీచర్లు, ఆయాలతో సదస్సులు నిర్వహించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.అంగన్వాడీ టీచర్ల సూచనలు స్వీకరించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

అక్టోబర్ తొలి వారంలోగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల యూనిఫామ్ లు
అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల యూనిఫామ్ లను అక్టోబర్ తొలి వారంలోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో అడాప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 అడాప్షన్ సెంటర్లు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించగా అవసరానికి తగ్గట్టు అడాప్షన్ సెంటర్లు ఏర్పాటు చెయ్యాలన్నారు.
16 జిల్లాల్లో నియామకాల నోటిఫికేషన్లు జారీ చేశారన్న మంత్రి
అంగన్వాడీ టీచర్లు, ఆయాల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. 16 జిల్లాల్లో నియామకాల నోటిఫికేషన్లు జారీ చేశారని, మిగిలిన జిల్లాల్లో కలెక్టర్లతో సమన్వయం చేయాలని ఆదేశం ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల పోషకాహారం, ఎదుగుదలపై శాంపిల్ సర్వే నిర్వహించాలని మంత్రి సీతక్క తెలిపారు. సర్వే ఆధారంగా పోషకాహార కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని చెప్పారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులు లాప్స్ కాకుండా వినియోగించాలన్న సీతక్క
కేంద్రం నుంచి వచ్చే నిధులు లాప్స్ కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి రూపాయి వినియోగించాలన్న మంత్రి సీతక్క అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications