ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు - ఐఆర్, బకాయిలపై కీలక నిర్ణయం..!?
ఏపీ ప్రభుత్వం మరోరసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్దమైంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తమ డిమాండ్ల కోసం ఉద్యోగ సంఘాల నిరసనకు నిర్ణయించారు. గతంలో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం పైన ఉద్యోగ సంఘాలు పోరాటం చేయాలని నిర్ణయించారు. దీంతో, అప్రమత్తమైన ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఆహ్వానించింది. ఐఆర్ తో పాటుగా బకాయిల చెల్లింపు పైన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వం చర్చలు
ఎన్నికల వేళ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. పీఆర్సీ సహా పెండింగ్ డీఏలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ అహ్వానించింది. పెండింగ్ డీఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవ్‌లు, పెన్షన్ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్నీ కలిపి 20 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 12 పీఆర్సీకి ఇంకా ప్రతిపాదనలు స్వీకరించకపోవటంతో ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగులకు ఐఆర్
ఏపీ ఎన్జీవో నేతృత్వంలోని ఏపీజేఏసీ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి అందజేసింది. ఈ నెల 27 తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని ఏపీజేఏసీ స్పష్టం చేసింది. చర్చల వేళ మధ్యంతర భృతికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. చలో విజయవాడకు అనుమతి లేదంటూ పోలీసులు ఉద్యోగులు, పెన్షనర్లకు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు. పెండింగ్ బకాయిల గురించి గత సమావేశంలో ప్రభుత్వం తమ ఆలోచన వెల్లడించింది. ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ బకాయిల చెల్లింపు పైన ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వ నిర్ణయాలు
ఇదే సమయంలో 12వ పీఆర్సీ నియమించిన ప్రభుత్వం ఇప్పుడు వేతన సవరణ సంఘం కోసం కార్యాలయం, తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్ డీఏల విషయంలో గతంలోనే హామీ ఇచ్చినా అమలు చేయకపోవటం పైన ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో..ఈ రోజు జరిగే చర్చల్లో డీఏతో పాటుగా ఐఆర్ పైన ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చల సమయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ వస్తుంది..ఐఆర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉద్యోగుల్లో ఉత్కంఠతకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications