సీఎం కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిసారిగా కొత్త పాలన!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా మంత్లీ ఎకనామిక్ రిపోర్టులు ఆధారంగా రాష్ట్ర అభివృద్ధిని, పాలనా విధానాన్ని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అమరావతిలో జరిగిన మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్‌వోడీలు కీలక సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్, కేపీఐ బేస్డ్ ఫ్రేమ్ వర్క్ ద్వారా రాష్ట్ర వృద్ధి రేటును, విభిన్న రంగాల ప్రగతిని రియల్ టైమ్‌లో నమోదు చేస్తూ లోటుపాట్లను సరిదిద్దుకోనున్నట్లు వారు ప్రకటించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2019-2024 మధ్య కాలంలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమై తీవ్ర విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలనలో పారిశ్రామికవేత్తలు ఏపీపై నమ్మకం కోల్పోయారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చి ఏపీని మళ్లీ 'మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్'గా నిలబెట్టిందని చెప్పారు. ఫలితంగా మళ్లీ పెద్దఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

కోస్తాలో ఆక్వా, రాయలసీమలో ఉద్యాన పంటలు, ఖనిజ వనరులు వంటి అపార అవకాశాలను వాడుకుంటూ, విలువైన ఖనిజాలకు వాల్యూ అడిషన్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 'స్వర్ణాంధ్ర-2047' విజన్ ద్వారా తలసరి ఆదాయం, జీఎస్డీపీ లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, ప్రస్తుతం నమోదైన 10.75 శాతం వృద్ధిని రాబోయే రోజుల్లో 15 శాతానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి
గత ప్రభుత్వ లోపాల వల్ల ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించి 'జీరో పెండెన్సీ' సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సమస్యలు కొలిక్కి తెచ్చామని, ఇంకా 72 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇందుకోసం అవసరమైతే నిబంధనలు మార్చడానికి, చట్టాలను సవరించడానికి వెనుకాడబోమన్నారు. ఇదే సమయంలో కొందరు కీలక స్థానాల్లో ఉండి నెగెటివ్ రోల్ ప్లే చేయడం సరికాదని, ఉన్నతాధికారులు కూడా కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలని హెచ్చరించారు.
ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచం
ప్రజలపై భారం పడకుండా చూస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మూడో ఏడాదిలోకి అడుగుపెట్టినా విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, ఐదేళ్ల పాటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్న మాటను నిలబెట్టుకుంటామని ప్రకటించారు. అంతెందుకు, ట్రూ డౌన్ అమలు చేసి విద్యుత్ ఛార్జీలను తగ్గించామని కూడా గుర్తుచేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావాలను తట్టుకునేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని, ఇండక్షన్ స్టవ్‌ల వినియోగంతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులకు అగ్ర ప్రాధాన్యం
రాష్ట్రంలో జలసంరక్షణ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, పట్టిసీమ వల్లనే గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించి ఆదుకోగలుగుతున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని చెబుతూ కీలక మైలురాళ్లను ప్రకటించారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాబోయే ఆగస్టు 14వ తేదీన పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను విడుదల చేస్తాం. సెప్టెంబరు 1వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను జాతికి అంకితం ఇవ్వబోతున్నాం.
కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ పునరుద్ధరించామని, జల్ జీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్రంలో గరిష్టంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. 'గుడ్ ఆఫీసర్ సమస్యను పరిష్కరిస్తే.. గ్రేట్ ఆఫీసర్ సమస్య రాకుండా ముందే అడ్డుకుంటారు' అనే సూత్రాన్ని గుర్తు చేస్తూ, ముందుచూపుతో పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందించాలని అధికారులకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications