సెప్టెంబర్ 15 నుంచి ఏపీలో కొత్తగా- జగన్ ఆదేశాలు జారీ: అర్హత గల ప్రతి కుటుంబం లబ్ది పొందేలా
అమరావతి: వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖపై ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ సేవలు, దీని పరిధిలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్య పెంపు, కొత్త వైద్య కళాశాల నిర్మాణం- ప్రారంభం.. వంటి అంశాలను ఆయన సమీక్షించారు. అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు.
ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కొరికీ అవగాహన కల్పించాలని వైఎస్ జగన్ సూచించారు. దీనికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. సెప్టెంబరు 15వ తేదీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. అర్హత గల ప్రతి కుటుంబమూ ఆరోగ్యశ్రీ సేవలను పొందేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలు, నెట్‌వర్క్ ఆసుపత్రులు.. వంటి సమగ్ర సమాచారంతో కూడిన బుక్‌లెట్‌ను ఇంటింటికీ అందజేయాలని జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందడం ఎలా? అనే విషయంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, విలేజ్ క్లినిక్ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా పూర్తి వివరాలతో సమాచారం అందించాలని సూచించారు.
ప్రతి గడపకూ వెళ్లి ఆరోగ్యశ్రీ గురించి పూర్తి వివరాలను లబ్దిదారులకు తెలియజేయాలని జగన్ అన్నారు. అనారోగ్యానికి గురైనా, ఏదైనా ప్రమాదం సంభవించినా.. వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఎలా చికిత్స పొందాలనే విషయంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. వారు ఉంటున్న ప్రాంతానికి అత్యంత సమీపంలోని నెట్‌వర్క్ ఆస్పత్రిలో ఎలా చికిత్స అందుకోవాలన్నదానిపై అవగాహన ఉండాలని చెప్పారు.

ఒక్క యాప్ ద్వారానే కాకుండా ఇతర మార్గాలు, కాల్ సెంటర్ల ద్వారా కూడా ఆరోగ్యశ్రీ సేవలను పొందడంపై కార్డుదారులకు పూర్తి అవగాహన ఉండాలని జగన్ అన్నారు. అప్పుడే ఈ పథకం ఉద్దేశం నెరవేరుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద 3,255 అనారోగ్య సమస్యలకు చికిత్సను అందజేస్తోన్నామని వివరించారు.
ఈ సేవలను పొందడంపై ప్రజలకు పూర్తి అవగాహన, సమాచారం ఉండాలని, నెట్‌వర్క్ ఆస్పత్రులు వారి పరిధిలో తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పారు. విలేజ్ క్లినిక్స్, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని ఈ శిబిరాలు ఏర్పాటయ్యేలా చూడాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications