Chalo Vijayawada : సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ-షరతులతో అనుమతికి హైకోర్టు ఓకే !
ఏపీలో సీపీఎస్ రద్దు చేస్తామంటూ గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు ఉద్యోగులకు హామీ ఇచ్చిన వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చాక జీపీఎస్ అమలుకు చేస్తున్న ప్రయత్నాల్ని నిరసిస్తూ వారు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే గతంలో ఛలో విజయవాడ సందర్భంగా చోటుచేసుకున్న ఉదంతాలతో ఈసారి అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. అయితే కొన్ని షరతులతో ఛలో విజయవాడకు హైకోర్టు అనుమతి ఇచ్చేందుకు అంగీకరించింది.
వాస్తవానికి ఉద్యోగులు రేపు అంటే శుక్రవారం సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం నిరాకరించింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణలోనూ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పేసింది. గతంలో జరిగిన పలు ఘటనల్ని కోర్టు దృష్టికి తెచ్చింది. అయితే నిబంధనల మేరకు నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. దీంతో హైకోర్టు ఉద్యోగులకు కీలక సూచన చేసింది.

సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడకు హైకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు కొన్ని షరతులతో విజయవాడలో నిరసన తెలిపేందుకు అనుమతి ఇచ్చేందుకు అంగీకరించిన హైకోర్టు.. ఇందుకు రేపు కాకుండా మరో తేదీని ఎంచుకోవాలని వారికి సూచించింది. దీంతో ఉద్యోగులు మరో తేదీన ఛలో విజయవాడ నిర్వహించేందుకు చర్చలు జరుపుతున్నారు. అలాగే హైకోర్టు కూడా ఉద్యోగులకు ఈ కార్యక్రమం నిర్వహణ సందర్భంగా పలు ఆంక్షలు విధించింది.
ఛలో విజయవాడకు వచ్చే ఉద్యోగులు పోలీసులకు ఐడీ కార్డులు చూపించాలని, అలాగే పరిమిత సంఖ్యలోనే పాల్గొని నిరసన తెలపాలని కూడా సూచించింది. దీంతో ఉద్యోగులు మరో తేదీ ఎంచుకుని హైకోర్టు విధించిన ఆంక్షలకు లోబడి ఛలో విజయవాడ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం తాజాగా పలు ఉద్యోగ సంఘాలతో జీపీఎస్ ఆర్డినెన్స్ పై చర్చించింది. దీనికి పలు ఉపాధ్యాయ సంఘాలు హాజరు కాలేదు. అలాగే సీపీఎస్ ఉద్యోగ సంఘాలు కూడా దూరంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications