Sri Reddy: శ్రీరెడ్డికి భారీ ఊరట-హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి శ్రీరెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసులో శ్రీరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపడం ఖాయమని అంతా భావించారు. శ్రీరెడ్డి అయితే ఓ దశలో లోకేష్,చంద్రబాబు, పవన్ ను తనను టార్గెట్ చేయొద్దంటూ వీడియోల్లో విజ్ఞప్తి కూడా చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైలెంట్ గా ఉండిపోయింది. అయితే హైకోర్టులో మాత్రం ఆమెకు ఊరట లభించింది.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన శ్రీరెడ్డి.. అదే క్రమంలో చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేది. అదే సమయంలో వైఎస్ జగన్ ను ఆకాశానికెత్తేస్తూ వ్యాఖ్యలు చేసేది. కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవన్నట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వంలో కూటమి నేతలపై సోషల్ మీడియాలో దూషణలు చేసిన వారిపై ఒక్కొక్కటిగా కేసులు నమోదుకావడం మొదలైంది.
ఈ క్రమంలోనే శ్రీరెడ్డిని కూడా అరెస్టు చేస్తారని భావించారు. కానీ ఆమె వెనక్కి తగ్గింది. దీంతో కూటమి కూడా వదిలేసింది.

అయినా శ్రీరెడ్డిలో భయం మాత్రం పోలేదు. ఓవైపు వీడియోలు చేస్తూనే మరోవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో తనపై నమోదైన కేసుల్లో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో నమోదైన కేసుల్లో శ్రీరెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించింది. చిత్తూరు జిల్లాలో పెట్టిన కేసులపై మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది.












Click it and Unblock the Notifications