ఏపీ హైకోర్టు జడ్జిపై ట్రోల్స్..! బెంచ్ పైనే స్పందించిన న్యాయమూర్తి..!
ఏపీల గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని అప్పట్లో సీరియస్ గా తీసుకున్న హైకోర్టు.. సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది. దీంతో పలువురు నిందితుల్ని అరెస్టులు కూడా చేశారు. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ లో మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ అవుతోంది. హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తాజాగా ఇచ్చిన తీర్పుల్ని సోషల్ మీడియాలో పలువురు ట్రోల్స్ చేస్తున్నారు.
తాజాగా వైఎస్ జగన్ రెంటపాళ్ల టూర్ సందర్భంగా నమోదైన కేసులు, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు సంబంధించిన మరో కేసు, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న కాకినాడ పోర్టు వాటాల వ్యవహారం, అమరావతిపై వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడు కృష్ణంరాజుకు బెయిల్ వంటి కేసుల్లో నిందితులకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ఈ తీర్పులన్నీ హైకోర్టు జడ్డి జస్టిస్ శ్రీనివాసరెడ్డే ఇచ్చారు.

దీంతో ఆయనపై టీడీపీకి చెందిన పలువురు సానుభూతిపరులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇవాళ మరో కేసు విచారణ సందర్భంగా స్పందించారు. హైకోర్టులో తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుల బెయిల్ పై జరుగుతున్న విచారణ సందర్భంగా బెంచ్ పైనే న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజులుగా తనపై ట్రోల్స్ జరుగుతున్నాయని ఇప్పుడు ఈ కేసులో ఉత్తర్వులు ఇచ్చే దీనిపైనా ట్రోల్స్ జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఇవి దురదృష్టకరమైన పరిణామాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చారు.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఎదురైంది. వైసీపీ నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ పిటిషన్లు కూడా ఆయన బెంచ్ ముందే పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన జస్టిస్ శ్రీనివాసరెడ్డి.. వాటిని వేరే బెంచ్ ముందు తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్ధానంలో ఈ కేసుల్ని ఎవరు విచారించబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications