ఏపీ హైకోర్టు జడ్డీల బదిలీ చిచ్చు- గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి లాయర్ల ఫిర్యాదు!
ఏపీ హైకోర్టులో ఇద్దరు సీనియర్ జడ్డీలు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేష్ లను వేర్వేరు హైకోర్టులకు బదిలీ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో విధుల్ని బహిష్కరించి అడ్వకేట్స్ జేఏసీ నిరసనలు చేపడుతోంది. ఇవాళ విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జేఏసీ నేతలు కలిశారు.
హైకోర్టు జడ్డీల బదిలీ ఉత్తర్వులు వెలువడిన తర్వాత నిరసనలు చేపడుతున్న న్యాయవాదుల జేఏసీ ఇవాళ రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ తో భేటీ అయింది. ఈ భేటీలో గవర్నర్ కు తాజా పరిస్ధితుల్ని వివరించిన లాయర్లు.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ బదిలీల్ని ఆపాలని కోరారు. ఎల్లుండి ఆదివారం రాష్ట్రపతి ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము విజయవాడలోని రాజ్ భవన్ కు రానున్నారు. ఈ సమయంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం ద్వారా హైకోర్టు జడ్జీల బదిలీల్ని ఆపాలని లాయర్లు కోరారు.

లాయర్ల విజ్ఞప్తికి గవర్నర్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని జేఏసీ నేత, లాయర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.న్యాయవ్యవస్థ ఎలాంటి ప్రభావానికి గురి కాకుండా స్వేచ్ఛగా పనిచేయాలని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ కు కూడా చెప్పామన్నారు.
న్యాయవ్యవస్థలో ఉన్న న్యాయమూర్తులు న్యాయం చేయాలంటే న్యాయవాదుల సహకారం ఉండాలని, న్యాయ వ్యవస్థ అంటే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు కూడా అని ఆయన తెలిపారు. న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సు మేరకు బదిలీ చేయడం సరికాదన్నారు. దీనిపై తమ ఫిర్యాదు తీసుకున్న గవర్నర్ రాష్ట్రపతితో మాట్లాడతానని హామీ ఇచ్చారన్నారు.












Click it and Unblock the Notifications