రూపాయికే డిఫెన్స్ కాంట్రాక్ట్.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!
దేశ రక్షణ రంగానికి సంబంధించిన కాంట్రాక్టుల ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. డిఫెన్స్ ప్రాజెక్టుల వేలంలో కేవలం 'అతి తక్కువ ధర' (L1) కోట్ చేసినంత మాత్రాన గుడ్డిగా కాంట్రాక్టులు కట్టబెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నాణ్యత, సరఫరా సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేసేలా అసహజమైన రీతిలో తక్కువ ధరలకు వేలం పాడితే.. సదరు కంపెనీ ఆ ప్రాజెక్ట్‌ను నిజంగా పూర్తి చేయగలదా లేదా అని రక్షణ శాఖ ముందుగా నిశితంగా సమీక్షించాలని తేల్చి చెప్పింది. ఏకంగా 'ఒక్క రూపాయి' కే ప్రాజెక్ట్ చేస్తామంటూ దాఖలైన విచిత్రమైన బిడ్ల నేపథ్యంతో పాటు నమోదైన ఓ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక్క రూపాయి బిడ్.. అసలు కథేంటి?
రక్షణ పరిశోధన - అభివృద్ధి సంస్థ (DRDO) ఆధ్వర్యంలో 'డీసీపీపీ' (DCPP) నమూనాలో కొత్త ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ భాగస్వాములను ఆహ్వానిస్తుంటారు. ఈ ప్రక్రియలో మొదట ప్రయోగాత్మక ప్రోటోటైప్స్ తయారు చేయడానికి కంపెనీలు తక్కువ మొత్తానికే పోటీపడతాయి. భవిష్యత్తులో ఆర్మీ నుంచి వేల కోట్ల రూపాయల భారీ ఆర్డర్లు వస్తాయనే ఆశతో.. కొన్ని కంపెనీలు ప్రాజెక్ట్ సాధించడం కోసం ఏకంగా 'రూపాయి' మాత్రమే కోట్ చేసి బిడ్‌లు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ధోరణి ఆయుధాల నాణ్యతను, దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రాడార్‌లోకి మైన్స్ ప్రాజెక్ట్.. రచ్చకెక్కిన వ్యవహారం!
తాజాగా అత్యంత అధునాతన 'ప్రాసెసర్ బేస్డ్ మూర్‌డ్ మైన్' ప్రాజెక్ట్‌కు సంబంధించిన వేలంలో అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ అసహజంగా అత్యల్ప బిడ్ వేసిందని ఆరోపిస్తూ 'జేకే ఎంటర్‌ప్రైజెస్' కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రాథమికంగా వాడే ముడిసరుకు ఖర్చులకు కూడా సరిపోని ధరకు బిడ్ ఎలా వేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. 2025 డీఆర్‌డీఓ నిబంధనల ప్రకారం ఇలాంటి అసాధారణ తక్కువ బిడ్లపై ముందస్తు సాంకేతిక, ఆర్థిక పరిశీలన జరపడంలో అధికారుల వైఫల్యం ఉందంటూ ప్రస్తావించింది.
దేశ భద్రతే ముఖ్యం.. క్లియరెన్స్ ఉంటేనే ముందడుగు!
డిఫెన్స్ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి స్క్రూటినీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తదుపరి కాంట్రాక్ట్ పనులు ముందుకు తీసుకెళ్లాలని డీఆర్‌డీఓను హైకోర్టు ఆదేశించింది. సదరు కంపెనీ బిడ్ సాధ్యాసాధ్యాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, అది అన్ని ప్రమాణాలకు లోబడి ఉంటేనే తుది నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు రాబోయే రోజుల్లో రక్షణ రంగానికి చెందిన బిడ్డింగ్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా, అసాధారణ ధరలతో లబ్ధి పొందాలని చూసే కంపెనీలకు గట్టి చెక్ పెట్టనుంది.














Click it and Unblock the Notifications
