చెవిరెడ్డికి బిగ్ షాక్-క్వాష్ ను క్వాష్ చేసిన హైకోర్టు..!
ఏపీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవాళ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓ చిన్నారిపై రేప్ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసును కొట్టేయాలని హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో చెవిరెడ్డి వాదనతో ఏకీభవించని హైకోర్టు.. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
తిరుపతి జిల్లా యర్రావారిపాలెంకు చెందిన ఓ మైనర్ అత్యాచారానికి గురైనట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశారు.
అలాగే సోషల్ మీడియాలో కూడా దీనిపై పోస్టులు పెట్టారు. దీన్ని చట్ట ఉల్లంఘనగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సదరు మైనర్ కు వైద్య పరీక్షలు నిర్వహించి రేప్ జరగలేదని తేల్చారు. దీంతో మైనర్ బాలిక గుర్తింపును, ఆమె తల్లితండ్రుల గుర్తింపును బహిర్గతం చేసినందుకు ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద చెవిరెడ్డిపై కేసు నమోదు చేశారు.

బాలిక చదివే స్కూలుకు వెళ్లి ఆమెకు అండగా ఉంటామని చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా తిరుపతి పోలీసులు పోక్సో కేసు పెట్టారు. దీన్ని కొట్టేయాలని కోరుతూ చెవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు.. బాలిక తండ్రి అసత్య ప్రచారం చేసి తన పరువు తీశారని చేసిన ఫిర్యాదులో వాస్తవం ఉన్నట్లు గుర్తించింది. దీంతో చెవిరెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తే కీలక తీర్పు వెలువరించింది. దీంతో పోక్సో కేసులో చెవిరెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తిరుపతి పోలీసులు చెవిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications