జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్- అరకొర చెల్లింపులు- మళ్లీ కోర్టుకు అధికారులు
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనుల బిల్లుల చెల్లింపుల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. టీడీపీ నేతలు చేసిన పనులు కావడంతో ఉద్దేశపూర్వకంగానే బిల్లుల చెల్లింపు నిలిపేసినట్లు విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో హైకోర్టు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. తాము ఆదేశాలు ఇచ్చినా అరకొర చెల్లింపులు చేయడంపై హైకోర్టు ఇవాళ వైసీపీ సర్కార్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉపాధి హామీ బకాయిలు
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉపాధి హామీ పథకం కింద కాంట్రాక్టర్లు పనులు చేశారు. వీరికి ఇప్పటివరకూ చెల్లింపులు చేయలేదు. దీంతో వీరిలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వంలో తాము చేసిన పనులకు ఇప్పటివరకూ వైసీపీ సర్కార్ బిల్లులు చెల్లించకపోవడాన్ని వారు సవాల్ చేశారు. దీనిపై గతంలో పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు.. జగన్ సర్కార్ పై సీరియస్ అయింది. కోర్టు దిక్కార కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా బిల్లులు చెల్లించలేదు.

జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్
ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించేందుకు తాము ఆగస్టు 1 వరకూ గడువు ఇచ్చినా ఇప్పటికీ చెల్లింపులు చేయకపోవడంపై హైకోర్టు ఇవాళ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం రూ1794 కోట్లకు గాను రూ413 కోట్లు చెల్లింపులు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధుల చెల్లింపులో ప్రభుత్వ అలసత్వవం పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలా చేస్తే మేము చాలా సీరియస్ గా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు జగన్ సర్కార్ ను హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది.

సర్కార్ సాకులపై ఆగ్రహం
ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్లో రూ.413 కోట్లు చెల్లించామని చెబుతున్నా వాస్తవంగా రూ.43 కోట్లు మాత్రమే చెల్లించారని డిఫెన్స్ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. పూర్తి సమాచారంలో అధికారులు ఎందుకు కోర్టుకు రావడం లేదని నిలదీసింది. ప్రతీసారీ సాకులు చెప్పడంపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. మీరు చెప్పే సాకులు కౌంటర్లో కూడా లేవని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం పేర్కొంది
Recommended Video

సీరియస్ ఆదేశాలు తప్పవన్న హైకోర్టు
ఏపీ ప్రభుత్వం ఇలానే ఉంటే తాము సీరియస్ గా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి బిల్లులో 20 శాతం ఎందుకు కోత విధిస్తున్నారు అని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బిల్లుల్లో 20 శాతం డబ్బులు మినహాయించి ఎక్కడ ఉంచుతున్నారని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది వద్ద సమాధానం లేకపోవడంతో.. ఎలాంటి వివరాలు లేకుండా హైకోర్టుకు ఎందుకు వస్తున్నారని ధర్మాసనం నిలదీసింది. అధికారులంతా మళ్లీ వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 18 కేసు విచారణ వాయిదా వేసింది. ఆలోగా పూర్తి డేటాతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications