AP Inter results 2025 : ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల అప్పుడే-వాట్సాప్ లోనే..!
ఏపీలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం చురుగ్గా నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డు.. త్వరలో ఫలితాల విడుదలకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించిన కీలక వివరాలను ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఇందులో ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, ఎక్కడ వీటిని తెలుసుకోవచ్చనే వివరాలు ఉన్నాయి.
ఇంటర్ మీడియట్ పరీక్ష తొలి, ద్వితీయ ఏడాది పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఈసారి వాట్సాప్ లోనే ఫలితాలు చూసుకునేందుకు అధికారులు వీలు కల్పించారు. ఇప్పటికే అన్ని పరీక్షల ఫలితాలను వాట్సాప్ లోనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇంటర్ ఫలితాలను కూడా ఇదే విధానంలో విడుదల చేయబోతున్నారు. అలాగే ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ మధ్య ఎప్పుడైనా ఇంటర్ ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు అధికారులు చెప్తున్నారు.

ఇప్పటికే మొదలైన ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6న పూర్తవుతోంది. ఆ తర్వాత వీటిని కంప్యూటర్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి మరో ఐదారు రోజులు పడుతుందని అంచనా. ఆ తర్వాత ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాట్సాప్ లో విడుదల చేసే ఫలితాలు షార్ట్ మెమోలుగా ఉపయోగపడనున్నాయి. కాబట్టి వీటిని పీడీఎఫ్ రూపంలోనే ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇంటర్ ఫలితాలను bieap.apcfss.in లేదా resultsbie.ap.gov.in వెబ్ సైట్లలోనూ తెలుసుకోవచ్చు.
ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరిగాయి. అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఈ ఏడాది పరీక్షలు రాశారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications