జగన్ హయాం ఐపీఎస్ లకు షాక్-ఒకరి సస్పెన్షన్ పొడిగింపు, మరొకరికి రిమాండ్..!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ తామై వ్యవహరించిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఇవాళ షాక్ తగిలింది. ఇద్దరిలో ఒకరిని కూటమి ప్రభుత్వం క్రమశిక్షణా కారణాలతో విధించిన సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఐపీఎస్ ను ఏసీబీ కోర్టు అవినీతి కేసులో రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఒకే రోజు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
వైసీపీ హయాంలో సీఐడీ ఛీఫ్ గా వ్యవహరించిన ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ పై అప్పట్లోనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిపై జగన్ స్పందించలేదు. ఇప్పుడు కూటమి సర్కార్ ఇవాళ పీవీ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కుమార్ పై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేసిన ఆరోపణలతో పాటు అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన సాయం దుర్వినియోగం, మాజీ ఎంపీ రఘురామపై దాడి వంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనపై గతంలో సస్పెన్షన్ విధించారు.

గతేడాది సునీల్ కుమార్ పై విధించిన సస్పెన్షన్ ను ఈ ఏడాది ఏప్రిల్ లో నాలుగు నెలలు పొడిగించారు. ఇప్పుడు దాన్ని మరోసారి ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసారు. ఆయనపై నమోదైన కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సస్పెన్షన్ ఎత్తేస్తే ఆధారాలు మాయం చేసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు అగ్నిమాపక శాఖలో డీజీగా పనిచేసిన సమయంలో కోటి రూపాయలకు పైగా నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐపీఎస్ అధికారి సంజయ్ అరెస్టు అయ్యారు. ఈ కేసులో ఆయనకు రెండు వారాల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో మార్గదర్శి సహా పలు కీలక కేసుల్లో సంజయ్ వైఖరి వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో సంజయ్ పై అవినీతి కేసు నమోదు చేసారు. దీనిపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఊరట దక్కకపోవడంతో ఆయన అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications