నాగార్జునసాగర్ నీటిని విడుదల చెయ్యాలని తెలంగాణాను ఆదేశించండి: కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ!!
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల నుంచి ఏడు టీఎంసీల నీటిని అత్యవసరంగా విడుదల చేయాలని ఏపీ జల వనరుల శాఖ రాసిన లేఖలో పేర్కొంది. నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాలువ నుంచి ఆరు టీఎంసీలు, ఎడమ కాలువ నుంచి ఏపీ సరిహద్దు ప్రాంతాలకు ఒక టిఎంసి నీటిని విడుదల చేసేలా తెలంగాణ అధికారులను ఆదేశించాలని లేఖలో పేర్కొంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో ఇప్పటికీ ఇబ్బందులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం ఆరోపణలు చేసుకుంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి లేఖలు రాయడం పరిపాటిగా మారింది. ఇక తాజాగా ఏపీ తాము రాసిన లేఖలో వేసవికాలం దృష్ట్యా తాగునీటి అవసరాలకు, ఎండిపోయే దశలో ఉన్న పంట పొలాలకు నీరు అవసరమని పేర్కొంది.

తక్షణం నాగార్జునసాగర్ హెడ్ రెగ్యులేటర్ నుండి నీరు ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదేశించాలని కోరింది. అంతే కాదు కృష్ణానది బేసిన్ లో తమకు కేటాయించిన నీటిని వినియోగించుకునే వాటాలో 163 టీఎంసీల నీటిని ఏపీ ఇంకా వినియోగించుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం కేవలం 326 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవలసి ఉన్నప్పటికీ, ఇప్పటికే 417 టిఎంసిల నీటిని వాడుకుందని ఏపీ తన లేఖలో పేర్కొంది.
ఏపీ ఇప్పటివరకు తనకు దక్కిన వాటాలో 53% నీటిని మాత్రమే వినియోగించుకుందని కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు స్పష్టం చేసిన అధికారులు ఇంకా తాము ఉమ్మడి ప్రాజెక్టుల నుండి 126 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉందని లేఖ ద్వారా వెల్లడించారు. కాబట్టి తమ తక్షణ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎండిపోతున్న పంటలు, తాగునీటి అవసరాల దృష్ట్యా ఏడు టీఎంసీల నీటిని విడుదల చేసేలా ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరింది. .












Click it and Unblock the Notifications