ఏపీలో స్ధానిక ఎన్నికలు మరోసారి వాయిదా ? ఏప్రిల్ నెలాఖరుతో ముగుస్తున్న గడువు..
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు ప్రారంభం కాగానే కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది. పరిస్ధితిని ముందుగానే గమనించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ధానిక పోరును ఆరు వారాల పాటు వాయిదా వేశారు. దీనిపై అధికార వైసీపీ స్పందన ఎలా ఉన్నా.. వాయిదా నిర్ణయమే సరైనదని మెజారిటీ జనం అంగీకరించ తప్పని పరిస్ధితి. అయితే కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్నందున మరోసారి లాక్ డౌన్ పొడిగించడంతో ఎన్నికల వాయిదా కూడా పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది.

ఏపీ స్ధానిక పోరు మరోసారి వాయిదా..!
ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్‌తి కారణంగా స్ధానిక ఎన్నికలు నిర్వహించలేని పరిస్ధితి. ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆరు వారాల పాటు విధించిన ఎన్నికల వాయిదా గడువు ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. దీంతో కేంద్రం విధించిన లాక్ డౌన్ నిబంధనలను అనుసరించి ఎన్నికల వాయిదానూ పొడిగించాల్సిన పరిస్ధితి నెలకొంది. రాష్ట్రంలో తాజా పరిస్దితులపై ఇప్పటికే అధికారులతో భేటీ అయిన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే ఎన్నికల వాయిదా పొడిగింపుపై నిర్ణయం ప్రకటించేందుకు మాత్రం కేంద్రం ప్రకటన అడ్డుగా మారింది.

లాక్ డౌన్ పొడిగింపు ప్రకటనతో..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ను మే నెల 3వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని.. హాట్ స్పాట్లులో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత సడలింపులు ఇస్తామని వెల్లడించారు. అయితే సడలింపుల వరకూ అయితే ఓకే కానీ ఎన్నికల ఎన్నికల మాత్రం సాధ్యం కాదు. కాబట్టి కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వాయిదాను పొడిగించక తప్పని పరిస్ధితి నెలకొంది

అధికారులతో ఈసీ సమీక్ష...త్వరలో ప్రకటన...
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ను మే నెల 3వ తేదీ వరకూ పొడిగించిన నేపథ్యంలో ఎలాగో అప్పటి వరకూ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. అదే సమయంలో ఆ తర్వాత లాక్ డౌన్ పొడిగింపు ఉన్నా లేకపోయినా సరే ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేదు. కాబట్టి మరో ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేయొచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా వినతులు వస్తే ఎన్నికల నిర్వహణ విషయంలో కాస్త మార్పులు చేర్పులు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ దిశగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. త్వరలో దీనిపై ఓ ప్రకటన వెలువడనుంది.












Click it and Unblock the Notifications