ఎన్నికలు బుల్లెట్లతో కాదు.. బ్యాలెట్‌తో జరగాలని వైసీపీ డిమాండ్.. ఎస్ఈసికి ఫిర్యాదు!
ఓటమి భయంతో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు టీడీపీ శ్రేణులు చించేశాయని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూటమి పాలనపై భగ్గుమన్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్లు, స్క్రూట్నీ సందర్భంగా రాష్ట్రంలో సాగుతున్న అధికార పార్టీ అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను వైయస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, నారాయణమూర్తి తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్ఈసీ కార్యాలయం వద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించిన వీడియోలు, సాక్ష్యాధారాలను పెన్‌డ్రైవ్‌లో ఎస్ఈసీకి అందజేశామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో నామినేషన్ల అడ్డగింతలు, దాడులు జరిగాయని, ఈ సందర్భాలలో పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశామని చెప్పారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని చోట్ల పోలీసులే నామినేషన్ పత్రాలు లాక్కున్నారని ఆరోపించారు.

ఎంపీలు మిథున్‌రెడ్డి, గురుమూర్తి, అవినాష్‌రెడ్డిపై దాడుల అంశాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు, కనిగిరి స్క్రూటీ కేంద్రాల్లోనే నామినేషన్ పత్రాలు చించివేశారని ఆయన పేర్కొన్నారు. పొద్దుటూరు, కుప్పంలో వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగాయన్నారు. కుప్పంలో మున్సిపల్ అభ్యర్థి విజయ్‌కుమార్ కిడ్నాప్ చేశారని, ఆయన ఆచూకీ తెలియడం లేదన్నారు.
సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని కోరినా అనేక ప్రాంతాల్లో అమలు కాలేదని అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలున్నా ఎన్నికల కేంద్రాల్లో పర్యవేక్షణ ఏర్పాట్లలో లోపాలున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అక్రమాలు జరిగిన 22 ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియను తిరిగి నిర్వహించాలి. లేదా ఎన్నికలను వాయిదా వేయాలన్నారు. తిరుపతి మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ బీసీ ధ్రువపత్రాలను పరిశీలించి నామినేషన్‌పై నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్నారు.
అధికారులపై ఒత్తిళ్లతో అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించవద్దని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశామన్నారు. స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికలు బుల్లెట్లతో కాదు.. బ్యాలెట్‌తో జరగాలని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి ప్రజాస్వామ్యాన్ని, అభ్యర్థుల నామినేషన్ హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వారికే వేస్తారన్నారు. ప్రజల మద్దతుతో బ్యాలెట్‌పై గెలవాలి.. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేయకూడదని ఆయన హితవు పలికారు.. 22 ప్రాంతాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఎస్ఈసీకి అందించాం, ఎన్నికల సంఘం ఇప్పటికైనా మేల్కొని అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలైనా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు.













Click it and Unblock the Notifications
