రైతుల ఖాతాల్లో రూ.20వేలు... అన్నదాత సుఖీభవపై చంద్రబాబు ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలో రైతులకు పంట వేసేందుకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతుభరోసా పథకంలానే తాము కూడా అన్నదాత సుఖీభవ పథకం తీసుకొస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రైతులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీనిపై తాజాగా శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ప్రతి సంవత్సరం అర్హులైన అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద రూ.20వేలు అందిస్తామని చెప్పారు.
బడ్జెట్ లో రూ.4,500 కోట్లు
ఇచ్చే రూ.20వేలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు, కేంద్రం ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ కింద వచ్చే రూ.6వేలు కలిపివుంటాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి రూ.41.4 లక్షల మంది రైతులు అర్హులని, వారికి మొన్నటి బడ్జెట్ లో రూ.4500 కోట్లు కేటాయించినట్లు మండలిలో తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసింది ఏమీలేదని, ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదంటూ మండిపడ్డారు. 2019 ఎన్నికల హామీలో వైసీపీ రైతులకు రూ.12,500 ఇస్తామని ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చే రూ.6వేలు, తాము రూ.7,500 కలిపి రూ.13,500 మాత్రమే ఇచ్చారని వైసీపీ ప్రభుత్వ హయాంపై ధ్వజమెత్తారు.

త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు
ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో భూసార పరీక్షలు జరగలేదని, ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు అవసరమైన పరికరాలను కంపెనీలతో మాట్లాడి అందించలేదని, రాయితీపై విత్తనాలివ్వలేదంటూ పలు విషయాలను తెలిపారు. కనీసం పంట బీమా కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ వస్తున్నామని, భూసార పరీక్షలు జరుగుతున్నాయని, డ్రోన్ సాంకేతికతను తీసుకురావడం, వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచడం, రాయితీ, బీమాలాంటి ఎన్నో మార్పులను తీసుకొచ్చామన్నారు. బడ్జెట్ లో నిధులు కేటాయించిన తర్వాత ఏ ప్రభుత్వమైన కచ్చితంగా అమలు చేసి తీరాలని, తమ ప్రభుత్వం అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయించిన తర్వాత ఆందోళన ఎందుకని వైసీపీని ప్రశ్నించారు. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ.20వేలు జమ చేయబోతున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.












Click it and Unblock the Notifications