కోటంరెడ్డి ఆరోపణల్ని తోసిపుచ్చిన బాలినేని, కాకాణి- ఇన్ ఛార్జ్ కోరిన తమ్ముడు !
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్టానంపై చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని పార్టీ సీనియర్ నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ ఖండించారు.
ఏపీలో వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో కోటంరెడ్డి పార్టీ వీడేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ సీనియర్లు స్పందిస్తున్నారు.
వైసీపీ మాజీ మంత్రి, సీఎం జగన్ సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.
ఆరోపణలు కరెక్టో కాదో వెరిఫై చేసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనేది కోటంరెడ్డి అపోహ అయి ఉండొచ్చన్నారు. ఏదైనా ఉంటే ముందుగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని అడిగారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని కోటంరెడ్డికి బాలినేని సూచించారు.

ఫోన్ ట్యాపింగ్ పై ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని కోటంరెడ్డికి బాలినేని సూచించారు. నిన్న ఆయన తమ్ముడొచ్చి ఇన్ ఛార్జ్ నెల్లూరు రూరల్ సీటులో ఇన్ ఛార్జ్ పదవి తనకు ఇప్పించమని కోరినట్లు బాలినేని వెల్లడించారు. మీ అన్నతో మాట్లాడమని చెప్పానన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సీఎం చర్యలు తీసుకుంటారని కోటంరెడ్డికి బాలినేని హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆయన బావ, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా స్పందించారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కోటంరెడ్డి చెప్పలేదని కాకాణి తెలిపారు. సహజంగా ఫోన్ ట్యాపింగ్ జరగదన్నారు.
ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుంటానని కాకాణి చెప్పారు. ఇదంతా టీ కప్పులో తుఫాన్ మాత్రమేనని మంత్రి వ్యాఖ్యానించారు. తనపై ఈ వ్యవహారంపై ఎవరూ మాట్లాడలేదని, పార్టీలోనూ చర్చలేదని కాకాణి వెల్లడించారు.












Click it and Unblock the Notifications