ఏపీలో ఆ పెన్షన్ల ఏరివేతపై మంత్రి క్లారిటీ..! మార్చి 15 డెడ్ లైన్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతీ నెలా పెన్షన్ లబ్దిదదాుల సంఖ్య తగ్గుతోందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం గత ప్రభుత్వంలో అనర్హులకు ఇచ్చిన పెన్షన్లను తనిఖీ చేసి తొలగిస్తున్నట్లు చెబుతోంది. అయినా విమర్శలు మాత్రం ఆగడం లేదు. తాజాగా దివ్యాంగుల పెన్షన్లపై జరుగుతున్న తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ దీనిపై స్పష్టత ఇచ్చారు.
రాష్ట్రంలో దివ్యాంగుల ఫించన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల దివ్యాంగులకు సామాజిక భద్రతా ఫించన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకూ 1.20 లక్షల ఫించన్ల వెరిఫికేషన్ పూర్తి అయినట్లు వెల్లడించారు.

మరోవైపు అక్రమంగా పెన్షన్లు తొలగిస్తున్నట్లు వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. గతంలోని నియమ నిబంధనల ప్రకారమే ఈ పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. అర్హులైన ఏ ఒక్కరికీ ఎలాంటి అన్యాయం జరుగదన్నారు. ఒక జోన్ లోని వైద్యులు మరో జోన్ లో ఈ వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఎమ్.ఎస్.ఎం.ఈ.ల సర్వే కూడా ముమ్మరంగా సాగుతోందన్నారు. ఇప్పటి వరకూ 50 శాతం మేర సర్వే పూర్తయిందని, ఈ సర్వేకు సీఎం చంద్రబాబు మార్చి 15 వరకూ గడుపు పెట్టినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో పెన్షన్ లబ్దిదారులపై జరుగుతున్న ఈ తనిఖీలపై మంత్రి క్లారిటీ సంగతి ఎలా ఉన్నా వారిలో మాత్రం ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రతీ నెలా పెన్షన్ల సంఖ్య తగ్గిపోతుండటం వారిలో ఆందోళన నింపుతోంది. ఇదే అంశంపై వైసీపీ కూడా విమర్శలకు దిగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం అనర్హుల్ని మాత్రమే ఏరివేస్తున్నట్లు చెబుతోంది.












Click it and Unblock the Notifications