పవన్ నా తమ్ముడు-ఆయన సీఎం అవుతాడో లేదో కానీ.. చంద్రబాబును మాత్రం-వైసీపీ మంత్రి కామెంట్స్
అమరావతి : ఏపీలో రాజధానుల వ్యవహారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అమరావతి కోసం విపక్షాలు, మూడు రాజధానుల కోసం వైసీపీ తీవ్ర మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వైసీపీ ఏర్పాటు చేస్తున్న గర్జనలపై పెట్టిన ట్వీట్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.
తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ తనకు తమ్ముడేనని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆయన ఓ ట్విట్టర్ మాస్టర్, సినిమాలకు విరామం వచ్చినప్పుడు ఆయన ట్వీట్ చేయటం పరిపాటేనన్నారు. పవన్ రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చే ఉద్దేశం లేనట్టుందంటూ కొట్టు సెటైర్లు వేశారు. ఆయన పార్టీ టీడీపీకి దొడ్డిదారిన సహకరిస్తోందన్నారు. పవన్ సీఎం అవుతాడో లేదో తేలీదు గానీ చంద్రబాబును అధికారంలోకి తేవటమే పవన్ లక్ష్యమన్నారు.

పవన్ ఎన్నికల కోసం మూడు ఫార్ములాలు ప్రకటించారని, ప్రస్తుతం ఏ ఫార్ములా అమలు చేస్తున్నారో అయనకే తెలియాలని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో జగన్ రహిత పాలన తేవాలని పవన్ కోరుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు. అమరావతి రైతుల పాదయాత్ర పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఆ పాదయాత్రలో టీడీపీ నేతలే పాల్గోవటం దీనికి ఉదాహరణ అన్నారు. రైతుల పేరిట టీడీపీ చేస్తున్న ఫేక్ యాత్రగా కొట్టు దీన్ని అభివర్ణించారు. పాదయాత్రలో టీడీపీ నేతలు నోరు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
పవన్ ట్వీట్ ల ద్వారానే ప్రజలతో ఉన్నాను అనుకుంటాడని మంత్రి కొట్టు తెలిపారు. షూటింగ్ ల గ్యాప్ లో ఇలాంటి ట్వీట్ లు చేస్తాడన్నారు. పవన్ కు రాజకీయ విలువలు లేవని, చంద్రబాబు ను నిలబెట్టుకోవాలని పవన్ తాపత్రయ పడుతున్నాడని ఆక్షేపించారు. మా సామాజిక వర్గం వ్యక్తి ఇలా చేయడం చాలా బాధగా ఉందని కొట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్ ను వ్యతిరేకిస్తున్నారన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలంతా నమ్ముతున్నారని, లోపాయకారి ఒప్పందాలు చేసుకుని వెళ్తే పెద్ద ప్రభావం ఉండదన్నారు. పాదయాత్ర లో టీడీపీ నాయకులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, 600 మందితో యాత్ర చేయమంటే టీడీపీ వాళ్ళు ఎందుకు పాల్గొంటున్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు పాల్గొంటున్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications