ఏపీ పోలీసుల అత్యుత్సాహం-కామ్రేడ్లకు సారీ చెప్పిన నారా లోకేష్..!
ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకూ ప్రభుత్వాలు నేతల, మంత్రుల పర్యటనల సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగడం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం ఇలా ముందస్తు అరెస్టులు చేయడం, గృహనిర్భంధాలు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉంటామని ముందే చెప్పింది. ఇందుకు విరుద్దంగా ఓ ఘటన చోటుచేసుకోవడంతో ఏకంగా మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. సీఎం చంద్రబాబు ఇవాళ రాయలసీమలోని మడకశిర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి పోలీసులు ఎప్పటిలాగే స్థానిక కమ్యూనిస్టు నేతల్ని, ప్రజా సంఘాల వారిని ముందస్తు అరెస్టులు చేసేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ కు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించిన లోకేష్.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయా నేతల్ని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. లోకేష్ అంతటితో ఆగలేదు.

మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ ఎక్స్ లో ఓ ట్వీట్ కూడా పెట్టారు. ఇందులో సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదన్నారు.
మమ్మల్ని మన్నించండి కామ్రేడ్
— Lokesh Nara (@naralokesh) August 1, 2024
సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా… pic.twitter.com/mkpBnluRIR
ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వబోమని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతామన్నారు. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారుల్ని లోకేష్ కోరారు. అంతే కాదు ఈ ముందస్తు అరెస్టులపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వానికి రాసిన లేఖను కూడా తన క్షమాపణ పోస్టుకు లోకేష్ జత చేశారు.












Click it and Unblock the Notifications