జగన్ కు మంత్రి సత్యకుమార్ కౌంటర్. 'సీమ ప్రజలు ఛీ కొట్టినా'
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలకు పతనమై.. వారానికోసారి బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చుట్టపు చూపుగా వస్తున్నారని ఆరోపించారు. గంటల తరబడి ప్రసంగాలు చేస్తూ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి జగన్ నానా అగచాట్లు పడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
రాయలసీమ ప్రజలపట్ల మొసలి కన్నీరు కారుస్తున్న జగన్ మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని గుర్తుచేసుకుని, దానికి గల కారణాలు తెలుసుకోవాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ హితవు పలికారు. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీకి మొత్తం 52 స్థానాల్లో 49 సీట్లను కట్టబెట్టిన సీమ ప్రజలు 2024 ఎన్నికల్లో టీడీపీకి 45 స్థానాలతో ఎందుకు అందలం ఎక్కించారో గుర్తెరిగి, ఇప్పటికైనా జగన్ తన మోసపూరిత వైఖరిని మార్చుకోవాలని మంత్రి అన్నారు. గత ఎన్నికల్లో తన ఓటమి రాయలసీమ ప్రజల దురదృష్టముంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పెత్తందారి, ఆహంకార, అప్రజాస్వామిక వైఖరికి మరోసారి అద్దంపట్టిందని పేర్కొన్నారు. జగన్ ఐదేళ్ల పాలన సీమ ప్రజలు అసహ్యించుకునేలా ఉన్నాయన్నారు.

దోపిడి కోసం అనుమతి లేని పనులు
రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో తగిన అనుమతులు లేకుండా భారీ వ్యయంతో పనులు చేపట్టిన జగన్ ఎన్జీటీ ఆదేశాలతో వాటిని అర్దాంతరంగా నిలిపివేసిన వాస్తవాన్ని విస్మరించి, నేటి కూటమి ప్రభుత్వంపై బురుదజల్లడం తనకు అంటిన మకిలిని తొలగించుకోవడానికేనని అన్నారు. ఐదేళ్లపాలనలో పంచ భూతాలను దోచుకున్న జగన్ రెడ్డికి అభివృద్ధి, సంక్షేమాల సమన్వయ వారధిగా ఖ్యాతిగాంచిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడును విమర్శించే అర్హత లేదని మంత్రి స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబు స్థాయికి జగన్ రెడ్డి ఏ మాత్రం సరిపోరని, వారివురి మధ్య నక్కకు నాగ లోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. గతాన్ని మరచి తాను మళ్లీ అధికారంలోనికి వస్తానని జగన్ రెడ్డి పగటికలలు కంటున్నారని, కళ్లు తెరిచి రాష్ట్ర ప్రజలు తిరిగి ఎన్నటికీ తనను అంగీకరించరన్న కఠోర వాస్తవాన్ని జగన్ రెడ్డి తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ- వాస్తవాలు
2024లో జగన్ సీఎంగా దిగిపోయే నాటికి రూ.2,400 కోట్ల మేరకు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ పెట్టారని విమర్శించారు. ఈ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. రాజకీయ ఉనికి కోసం వైద్య సేవల అమలుపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. గత 13 నెలల కూటమి పాలనలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంకు జగన్ హయాంలో కంటే 80% పెరుగుదల నమోదైందని, లబ్ధిదారుల సంఖ్య 21% పెరిగిందని, దీని అర్ధమేంటని ప్రశ్నించారు. పదే పదే జగన్ అసత్యాలు పలుకడం ఆయనలోని నెలకొన్న నైరాశ్యాన్ని తెలియచేస్తుందన్నారు. తన నిర్వాకాలతో రాజకీయ సమాధికి చేరువగా ఉన్న మాజీ సీఎం నిరంతర అసత్యాలతో అధికార సౌధాలు నిర్మించలేరని మంత్రి ఎద్దేవా చేశారు. వైద్యం వంటి ముఖ్యమైన రంగాల్లో పీపీపీ విధానం అనుసరణీయమని దేశ విదేశాల్లో స్పష్టమవుతుండగా ప్రైవేటీకరణగా జగన్ పేర్కొనడం ఆయన అవివేకం. అహంకారానికి నిదర్శనమని మంత్రి దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications