ఏపీ మండలిపై ఎమ్మెల్సీ ఫలితాల ప్రభావం- వైసీపీ, టీడీపీ తాజా బలాలివే.. !
అమరావతి : ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు సంచలనం రేపాయి. స్ధానిక సంస్ధలు, పట్టభద్రులు, టీచర్లు, ఎమ్మెల్సీల కోటాలో 21 స్ధానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 17 సీట్లను గెల్చుకుంది. మరో నాలుగు సీట్లు టీడీపీ గెల్చుకుంది. మొత్తం సీట్లు గెల్చుకుంటామనే ధీమాలో ఉన్న వైసీపీకి..చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి భారీషాకులిచ్చారు. అంతేకాదు వచ్చే ఎన్నికలకు టీడీపీ రేసులోనే ఉన్నట్లు గుర్తుచేశారు.
తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారిపోయాయి. ఈ ఎన్నికలతో అప్పటివరకూ రెండు సీట్లతో ఉన్న బీజేపీ పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయింది. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58 కాగా.. వీరిలో అధికార వైసీపీ సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 33 నుంచి (గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వారితో కలిపి) 44కు చేరుకోనుంది. ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. అలాగే పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది.

తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2, మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైసీపీ, 4 స్థానాలు టీడీపీ దక్కించుకున్నాయి. అటు టీడీపీ కి చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు, మే నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు. వైసీపీ కి చెందిన ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 17 మంది విజయం సాధించారు.












Click it and Unblock the Notifications