టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధుల ప్రకటన..! లిస్టులో వీరే..!
ఆంధ్రప్రదేశ్ లో రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు కూటమిలో సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమిని నడుపుతున్న టీడీపీ (TDP) ఇవాళ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఇందులో టీడీపీ తీసుకున్న ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ మంగళగిరి-తాడేపల్లి మేయర్ అభ్యర్ధితో పాటు మరో 10 మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధులు కూడా ఉన్నారు. ఇప్పటికే బీజేపీ, జనసేన తమ అభ్యర్ధుల జాబితాల్ని ప్రకటించాయి.
ఇక టీడీపీ ప్రకటించిన జాబితాలో ప్రధానంగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అభ్యర్ధిగా పేరం ఏడుకొండలు పేరును ఖరారు చేశారు. అలాగే మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్ అభ్యర్ధులుగా ఆముదాలవలసకు కూన ప్రమీల, తణుకుకు బసవ వి.వి. రామకృష్ణ, పాలకొల్లుకు ఆబోతుల ఉషారాణి, వైఎస్సార్ తాడిగడపకు పీతా గోపీచంద్, గుడివాడకు మారీదు కరుణ, నరసరావుపేటకు నాగసరపు రూపేష్ గుప్తా, పొన్నూరుకు కండ్రు విజయలక్ష్మిని ప్రకటించారు.

అలాగే కందుకూరుకు పిడికిటి వెంకటేశ్వర్లు, గూడూరుకు చౌటూరి శిరీష, శ్రీకాళహస్తికి పేట బాలాజీని మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్ధులుగా ప్రకటించారు. ఇక నగర పంచాయతీల్లో చింతల పూడి నుంచి ఖంబం ఎస్తేరు రాణి, పొదిలి నుంచి వరికుంట్ల అనిల్ కుమార్, అల్లూరు నుంచి తోటకూర సునీల్ కుమార్, బి.కొత్తకోట నుంచి కుడుము శ్రీనివాసులును మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్ధులుగా టీడీపీ ఎంపిక చేసింది. వీరంతా కూటమి అభ్యర్ధులుగా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ నెల 26న నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లు, మరో 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మున్సిపల్ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగబోతోంది. వీటిలో టీడీపీ ఓ కార్పోరేషన్, 10 మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో పోటీ చేస్తుండగా.. జనసేన రెండు కార్పోరేషన్లు, మూడు ముున్సిపాలిటీల్లో, బీజేపీ ఓ కార్పోరేషన్, రెండు మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్నాయి. ఈ మేరకు మూడు పార్టీలు ఇవాళ సాయంత్రం అభ్యర్దుల్ని ప్రకటించాయి.












Click it and Unblock the Notifications
