పవనే కాదు టీడీపీ ఆఫీస్ పైనా డ్రోన్ చక్కర్లు..! విచారణలో షాకింగ్..
ఏపీలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యాలయంపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇలా డ్రోన్ చక్కర్లు కొట్టడంతో కార్యాలయ సిబ్బంది దాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు షాకింగ్ వివరాలు తెలిశాయి.
తాజాగా జనసేన రాష్ట్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. డ్రోన్ ఎవరు ఎగురవేశారు, ఎందుకు జనసేన కార్యాలయంపై ఎగరేశారు, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఇలా డ్రోన్ పంపారా ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరికి పవన్ ఆఫీసుపై ఎగిరిన డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ దిగా వారు గుర్తించారు. అంటే ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ ఫైబర్ నెట్ కు చెందిన డ్రోన్ ఇలా పవన్ ఆఫీసుపై చక్కర్లు కొట్టిందన్న మాట.

ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం నిర్వహిస్తోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరిలో ఈ అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగానే స్ధానికంగా మంగళగిరిలో ఉన్న టీడీపీ, జనసేన రాష్ట్ర కార్యాలయాలపై ఈ డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు. ప్రభుత్వానికి అవసరమైన డేటా ఇచ్చేందుకే ఈ డ్రోన్ వాడినట్లు పోలీసులు తేల్చారు. అలాగే పవన్ పై కానీ, జనసేన కార్యాలయంపైనా ఎలాంటి నిఘా పెట్టలేదని గుర్తించారు. దీంతో జనసేన వర్గాలు కూడా ఊపిరిపీల్చుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications