లోకేష్ పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్-ఎనర్జీ అసిస్టెంట్ల మరణాలు అందుకే - కనీస జ్ఞానం లేదంటూ..
ఏపీలో వరుసగా సంభవిస్తున్న ఎనర్టీ అసిస్టెంట్ల మరణాలపై టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలపై విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ తీవ్రంగా స్పందించారు. లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో పెద్దిరెడ్డి పలు అంశాల్ని ప్రస్తావించారు.
నారా లోకేష్ కు కనీస లోకజ్ఞానం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. వాస్తవాలు తెలుసుకునే ఇంగితం అసలే లేదన్నారు. అవివేకం... అనుభవరాహిత్యం... అజ్ఞానంతోనే లోకేష్ ప్రేలాపనలు చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. బాబు హయాంలో ఉద్యోగాలు లేక యువత నిరాశా, నిస్పృహల్లో కూరుకుపోయిందని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. సచివాలయ వ్యవస్థతో సీఎం వైయస్ జగన్ ఒక విప్లవాత్మక మార్పుకు నాంధి పలికారన్నారు. లక్షలాధి మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారన్నారు.

సచివాలయ ఉద్యోగులుగా ఎనర్జీ అసిస్టెంట్స్ నిబద్దతతో పనిచేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కితాబిచ్చారు. హాజరు కోసం వారికి అవసరమైన వెసులుబాటు కల్పించామన్నారు. కట్టుబానిసల్లా పనిచేస్తున్నారంటూ కించపరిచేలా లోకేష్ మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు. తమ హయాంలో కనీసం ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనే చంద్రబాబు చేయలేదన్నారు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు పొందిన యువత గురించి మాట్లాడే అర్హత లోకేష్ కు ఎక్కడిది? అని ఆయన ప్రశ్నంచారు.
రాష్ట్రంలో ఎనర్జీ అసిస్టెంట్లకు నిబంధనల ప్రకారమే విధుల్ని కేటాయిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. జాతీయ సంస్థల పర్యవేక్షణలో వారికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు వారికి ప్రొబేషన్, అందరు సచివాలయ ఉద్యోగులకు వర్తించే నిబంధనలు వర్తింప చేస్తున్నామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. విపత్తుల సమయంలోనూ ఎనర్జీ అసిస్టెంట్లు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారన్నారు. ప్రమాదాలకు గురైన సందర్భంలోనూ వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. తమకు ఆసరాగా నిలిచిన ప్రభుత్వం పట్ల ప్రేమతో, బాధ్యతతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. కానీ లోకేష్ మాత్రం ఎనర్జీ అసిస్టెంట్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications