చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ క్లారిటీ-బరువు వివాదంపైనా...
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై నిన్నటి నుంచి మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ మధ్య ఆయన్ను కలిసిన టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు చెబుతున్న మాటల్ని బట్టి చంద్రబాబు జైల్లో ఎండవేడిమి కారణంగా డీహైడ్రేషన్ కు గురైనట్లు, అనంతరం ఆయనకు స్కిన్ అలర్జీ కూడా సోకినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఇవాళ చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ ఇవాళ జైల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో చంద్రబాబు ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ముఖ్యంగా చంద్రబాబుకు స్కిన్ అలర్జీ, డీహైడ్రేషన్ అంటూ వస్తున్న వార్తలపై రవికిరణ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే జైల్లో చంద్రబాబుకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర అంశాలపై ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. టీడీపీ ఆరోపణల నేపథ్యంలో రవికిరణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చంద్రబాబు తాజాగా ఐదు కేజీల బరువు తగ్గారంటూ ఆయన భార్య భువనేశ్వరి చేస్తున్న ఆరోపణల్ని జైళ్లశాఖ డీఐజీ ఖండించారు. జైలు అధికారిక రిజిస్టర్ ప్రకారం ఆయన వచ్చినప్పుడు 66 కేజీలున్నారని, ఇప్పుడు ఆయన బరువు 67 కేజీలు అన్నారు. అలాగే భద్రతా పరంగా, ఆరోగ్యపరంగా కూడా చంద్రబాబుకు జైల్లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఆయన జైల్లోకి వచ్చినప్పటి నుంచి హైప్రొఫైల్ ఖైదీలాగే ట్రీట్ చేస్తున్నట్లు డీఐజీ తెలిపారు.
జైల్లో ఉన్న 2100 మంది ఖైదీలకు అక్కడి వాటర్ ట్యాంకులో నీరే సరఫరా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చంద్రబాబుకు తాగునీరు, భోజనం విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. స్కిన్ అలర్జీ వచ్చిందని తెలియగానే వైద్యుల్ని రప్పించి పరీక్షలు చేయించామన్నారు. జైల్లో సిబ్బంది ఆయనకు ప్రతీరోజూ వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఓఆర్ఎస్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. బయటి నుంచి వచ్చే ఆరోపణలు మాత్రం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications