మరో అల్పపీడనం.. ఏపీని తీవ్రంగా హెచ్చరిస్తున్న బంగాళాఖాతం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో అన్ని ప్రాంతాలలోనూ వర్షాలు కురవడం లేదు. కొన్ని ప్రాంతాలు ఎండలతో నిప్పుల కొలిమిని తలపిస్తుంటే కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కోసారి పగలంతా ఎండగానూ, ఏదో ఒక గంట పాటు వర్షం కురుస్తూ ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ వర్షాకాలం రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
అయితే తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక కీలక అప్డేట్ ను ఇచ్చింది. తూర్పు మధ్య అనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలోకి చేరే అవకాశం ఉందని, దీని ప్రభావంతో శనివారం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

నేడు ఈ జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉంటుందని తెలిపింది. ఇలా ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు మరియు చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ జిల్లాలలో తేలికపాటి వర్షాలకు చాన్స్
అంతేకాదు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి, అనంతపురం, వైయస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఏపీలో భిన్న వాతావరణం
కనుక వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక తూర్పు రాయలసీమలో బాగా వేడిగా ఉంటుందని వెల్లడించింది. ఏపీలో మాగ్జిమం ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని పేర్కొంది. భిన్న వాతావరణం ఉన్నప్పటికీ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.












Click it and Unblock the Notifications