ఏపీకి వరుణుడి అలెర్ట్.. వారికి కృష్ణమ్మ తీవ్ర హెచ్చరిక!
దేశవ్యాప్తంగా రెండు తుఫానులు, కొన్ని ద్రోణుల వాతావరణం కొనసాగుతుంది. దక్షిణాదిని అరేబియా సముద్రం దగ్గర ద్రోణి కొనసాగుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాలపై కూడా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. వీటికి తోడు ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలో ఈ జిల్లాలలో నేడు వర్షాలు
ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల, అనంతపురం, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, మరియు తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు మరియు కర్నూలు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

కృష్ణానదికి వరద .. అలెర్ట్ గా ఉండాల్సిన మండలాలివే
అంతేకాదు కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతుందని, తుంగభద్ర డాం వద్ద 19 నెంబర్ గేటు తెగి పడటంతో గేటు కొట్టుకుపోయిందని ఈ గేటు నుంచి సుమారు 35000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని పేర్కొన్నారు. మొత్తం 48 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల అవుతుందని, కనుక కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
కాలువలు, వాగులు దాటవద్దు
అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1070, 112,18004250101 లను సంప్రదించాలని సూచించారు. కృష్ణా నది పరివాహక ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. ఈరోజు ఉదయం రాయలసీమలోని కొన్నిచోట్ల మోస్తారు వర్షాలు కురిసినట్టు ఓవైపు సాటిలైట్ లైవ్ అంచనాలను బట్టి తెలుస్తుంది.
తీర ప్రాంత ప్రజలకు విపత్తు నిర్వహణా సంస్థ హెచ్చరిక
మళ్లీ సాయంత్రం 6 గంటల తర్వాత తూర్పు రాయలసీమలో వర్షాలు పడతాయని, ఎనిమిది గంటల తర్వాత తిరుమల, గుంటూరు సమీపంలో వర్షాలు పడే సూచన ఉన్నట్టు సాటిలైట్ అంచనాలతో తెలుస్తోంది. ఏది ఏమైనా కృష్ణా నదికి వరద పోటెత్తుతున్న వేళ ఏపీలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విపత్తు నిర్వహణా సంస్థ పేర్కొంది.












Click it and Unblock the Notifications