ఏపీ ప్రజలకు తీపికబురు: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో దశలవారీగా రోబోటిక్ శస్త్రచికిత్సలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు పెద్ద పీట వేస్తోంది. అత్యంత ఆధునిక వైద్య సేవలను ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యారోగ్య శాఖ పరిశీలిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఐవిఎఫ్ సెంటర్లు, బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలు, ఇతర అధునిక వైద్య సేవలను విస్తృతం చేసేందుకు రూ. 1,011కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇందులో ముఖ్యంగా రోబోటిక్ శస్త్రచికిత్సలను బోధనాసుపత్రుల్లో దశలవారీగా ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. తొలిదశలో విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో రూ.45 కోట్లతో రోబోటిక్ శస్త్రచికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, మలివిడతలో విశాఖ కేజీహెచ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లోనూ రోబోటిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. మంగళగిరిలోని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ మేరకు నాలుగు గంటలపాటు జరిగిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

బోధనాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పన, నిర్మాణాల పురోగతి, ఇతర ముఖ్యాంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రూ.1,011 కోట్లతో అత్యాధునిక వైద్య సేవలు, ప్రత్యేక చికిత్సా కేంద్రాలు, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ వివరించారు.
వైద్య విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించడంతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎంబీబీఎస్, పీజీ కోర్సుల నిర్వహణకు అవసరమైన భవనాలు, వైద్య పరికరాలను సిద్ధం చేయాలని సూచించారు. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి పీజీ సీట్ల మంజూరుకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదలైన రూ.343 కోట్లను త్వరగా వినియోగించి అవసరమైన పరికరాలను సమకూర్చాలని, నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రుల స్థాయి, రోగుల అవసరాలకు తగ్గట్టుగా సిటి స్కాన్‌లు, క్యాథ్‌ల్యాబ్‌లు, ఎంఆర్ఐలు ఎక్కడెక్కడ కావాలో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు స్పష్టం చేశారు.
గత జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను అవసరాల మేరకు చేపట్టకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. అలాగే నాడు-నేడు కింద చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేయకుండా గాలికొదిలేసిందని పేర్కొన్నారు. దీని వల్ల కూటమి ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. బోధనాసుపత్రుల్లో చేపట్టిన నిర్మాణాలు, ఇప్పటివరకు చేసిన వ్యయం, ఇంకా మంజూరు కావాల్సిన నిధుల వివరాలను తెలుసుకుని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications
