పంచాయతీల్లో ఏపీ సచివాలయాల విలీనం? ఏపీలో ఎన్నికల వేళ సర్కార్ ముందు..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్ధ పంచాయతీల ఉసురుతీస్తోంది. పంచాయతీల అధికారాలు, నిధుల్ని ప్రభుత్వం బహిరంగంగానే సచివాలయాలకు కట్టబెట్టేస్తుండటంతో సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాల్లా తయారయ్యారు. ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్ లు అధికారాలు చెలాయించడం తర్వాత, కనీసం తమ గ్రామాలకు నిధులు కూడా తెచ్చుకోలేని పరిస్ధితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో వారు ఓ కీలక డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు.
ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచ్ లు గ్రామ సచివాలయ వ్యవస్ధ తెచ్చిన తర్వాత తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఉద్యమాలు కూడా చేపట్టారు. అయినా ఫలితం లేదు. పంచాయతీలకు కేంద్రం ఆర్ధిక సంఘాల ద్వారా ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు మళ్లిస్తోందని, దీంతో తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అటుంచి పంచాయతీల కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్దితి ఎదురవుతోందని సర్పంచ్ లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లోకి సచివాలయాల్ని విలీనం చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నారు.

రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో రాష్ట్రంలో పంచాయతీలకు సమాంతరంగా తయారైన గ్రామ సచివాలయాలను అదే పంచాయతీల్లో విలీనం చేయాలని, తమకే అధికారాలు అప్పగించాలనే డిమాండ్ ను సర్పంచ్ లు తెరపైకి తెస్తున్నారు. దీంతో పాటు పలు డిమాండ్లతో జనవరి 1 నుంచి సమర శంఖారావం పేరుతో సభలు ఏర్పాటు చేసి తమ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటించారు.
సర్పంచ్ లు వినిపిస్తున్న డిమాండ్లలో ఎంపీపీ, జడ్పీటీసీలకు 30 వేల రూపాయల చొప్పున, సర్పంచ్ లు, ఎంపీటీసీలకు 15 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లింపు, విద్యుత్ బకాయిల చెల్లింపు, నిధుల మళ్లింపు నిలిపివేత వంటివి ఉన్నాయి. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12918 మంది సర్పంచ్ లు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని జిల్లాల్లో పర్యటించి పంచాయతీలకు జరుగుతున్న అన్యాయం వివరించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications