ఉపాధ్యాయలు సర్దుబాటుపై ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటు పై కీలక నిర్ణయం తీసుకుంది. బడుల్లో 98 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే తరగతులను రెండు గ్రూపులుగా విభజించాలని ఆదేశించింది.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. సర్దుబాటు ప్రక్రియ ఈ నెల 11 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసింది. విద్యార్ధుల సంఖ్య ప్రామణికంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసేలా విద్యా శాఖ స్పష్టత ఇచ్చింది.
సర్దుబాటు ఇలా
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ విద్యా శాఖ చేపట్టింది. ప్రాథమికోన్నత పాఠశాలలకు టీచర్ల కేటాయింపు విషయంలో సంఖ్య ఆధారిత నిర్ణయం తీసుకుంది. బడుల్లో 98 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే తరగతులను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. 1, 2 తరగతులు మొదటి గ్రూపు గాను, 3 నుంచి 8 తరగతుల వరకు రెండో గ్రూపుగా విభజించి ఆ మేరకు టీచర్లను సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం... ఈ నెల 7 నాటికి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటారు. అవసరం ఆధారంగా స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లను ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు.

మినహాయింపు పై
సబ్జెక్టు టీచర్లు మిగిలిపోతే అర్హతల ఆధారంగా వారిని వేరే సబ్జెక్టులోకి మారుస్తారు. అర్హతలు కలిగిన ఎస్జీటీలు మిగిలితే వారిని సబ్జెక్టులు బోధించేందుకు కేటాయిస్తారు. ఒకరి కంటే ఎక్కువమంది వ్యాయమ టీచర్లు ఉంటే వారిని అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. ఇంకా మిగిలిన వారిని ఏకోపాధ్యాయ పాఠశాలలకు కేటాయిస్తారు. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు మిగులు టీచర్లను పంపకూడదు. 2025 ఏప్రిల్ 30లోగా రిటైరయ్యే టీచర్లు, వంద శాతం దృష్టి లోపం ఉన్నవారికి సర్దుబాటు నుంచి మినహాయింపు ఉంటుంది.
మార్గదర్శకాలు
వితంతు, పెళ్లికాని, వేరుగా ఉండే, జీవిత భాగస్వామి గ్రౌండ్స్ ఉండే టీచర్లకు కూడా మినహాయింపు వర్తిస్తుంది. ఒకవేళ వారు కోరుకుంటే రెండో దశలో డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేయవచ్చు. మండల స్థాయిలో ఎంఈవో, డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జిల్లా స్థాయిలో డీఈవో నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. వారు ఆన్‌లైన్ నుంచి మిగులు టీచర్ల జాబితాలను డౌన్‌లోడ్ చేసుకుని, నిబంధనల ప్రకారం సర్దుబాటు చేయాలి. అప్పటికీ టీచర్లు మిగిలితే పొరుగు మండలం, డివిజన్‌కు సర్దుబాటు చేయాలి. సర్దుబాటులో తప్పులు జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహిస్తారు.












Click it and Unblock the Notifications