AP Weather: రేపు ఈ జిల్లాల్లో మంటలే..! రెండు రోజుల్లో అక్కడ వర్షాలు..!
ఏపీలో వేసవి ప్రభావంతో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. జనం ఇంట్లోంచి బయటికి వచ్చే పరిస్ధితులు ఉండటం లేదు. అయితే ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల జనం బయటకి రాక తప్పని పరిస్ధితులు ఉన్నాయి. ఈ తరుణంలో రేపు (ఆదివారం) రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత ఎలా ఉండబోతోందన్న దానిపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ తన అంచనాలను వెల్లడించింది. దీని ప్రకారం ఆదివారం 30 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 247 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, సోమవారం 15 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 69 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
అయితే మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ఆదివారం మాత్రం శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 12, పార్వతీపురంమన్యంలో 13, అల్లూరిసీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే వడగాల్పులు వీచే అవకాశం ఉన్న 247 మండలాల్లో
శ్రీకాకుళం 15, విజయనగరం 12, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 5, విశాఖ 1, అనకాపల్లి 12, కోనసీమ 1,
కాకినాడ 10, తూర్పుగోదావరి 14,ఏలూరు 7, కృష్ణా 5, ఎన్టీఆర్ 13, గుంటూరు 14, పల్నాడు 27, బాపట్ల 3, ప్రకాశం 23, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 24, కర్నూలు 10, అనంతపురం 1, శ్రీసత్యసాయి 1, వైయస్సార్ 19, అన్నమయ్య 10, తిరుపతి 17, చిత్తూరులోని విజయపురం మండలం ఉన్నాయి.
కాబట్టి ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచిస్తున్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.












Click it and Unblock the Notifications