ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులకు ఊరట-ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు కలిగాయని ఫిర్యాదు చేసే అభ్యర్థులకు సహకరించాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే తమ అభ్యర్ధులు నామినేషన్ వేయకుండా పోలీసులు, అధికార కూటమి పార్టీల కార్యకర్తలు అడ్డుకుని దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎస్ఈసీ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాష్ట్రంలో రెండో విడత మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణకు అక్టోబర్ 19న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ నామినేషన్లు దాఖలు చేయలేని వారిని సంప్రదించి, వారితో నామినేషన్లు వేయించాలని ఆదేశించింది. అలాగే నామినేషన్లు వేయకుండా తమను అడ్డుకున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

ఫిర్యాదు చేసిన అభ్యర్థులను ఫోన్ ద్వారా సంప్రదించి, నిర్ణీత గడువు ముగిసేలోగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సహకరించాలని స్పష్టం చేసింది.ఇలా ఫిర్యాదు చేసిన అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను నిర్దేశిత విధానం ప్రకారం స్వీకరించాలని సంబంధిత రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని తెలిపింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లే అభ్యర్థులకు అవసరమైన చోట వ్యక్తిగత భద్రత కల్పించాలని సంబంధిత జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఎస్ఈసీ ఆదేశించింది. అభ్యర్థులను సంబంధిత నామినేషన్ స్వీకరణ కేంద్రాలకు పోలీసు భద్రతతో తీసుకెళ్లి, నిర్ణీత సమయంలో ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సహకరించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలకు సూచించింది.













Click it and Unblock the Notifications
