12 గంటల్లోనే స్థానిక ఎన్నికల ఫలితాలు- పోలింగ్, కౌంటింగ్ పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (AP SEC) అనిల్ చంద్ర పునేఠా ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, పక్షపాత ధోరణికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని ఆదేశించారు. విజయవాడలోని తన కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఆయన మాట్లాడారు.
ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలు, రాజకీయ పార్టీల నుంచి అందుతున్న ఫిర్యాదులు, తదుపరి విడత ఎన్నికల సన్నద్ధత, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై ఎస్ఈసీ సమీక్షించారు. ఎన్నికల ప్రారంభ దశలో 7 జిల్లాల్లో ఘటనలు చోటుచేసుకోవడంతో పలు ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. నామినేషన్ల దాఖలకు ఆటంకాలు కల్పించడం, అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం, ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రతి ఫిర్యాదును డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాత ధోరణి అత్యంత ముఖ్యమని, న్యాయం జరగడమే కాకుండా ప్రజలకు న్యాయం జరిగినట్లు స్పష్టంగా కనిపించాలని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
ఎన్నికల అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదులు అందినప్పుడు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని రికార్డులు న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయని, అభ్యంతరాలు ఉన్నవారు ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని తెలిపారు.ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం అధికారుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలను పూర్తిగా నివారించగలిగితే ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. తదుపరి విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, తుఫాను ప్రభావిత జిల్లాల్లోనూ అధికారులు చేస్తున్న ఎన్నికల సన్నద్ధతను అభినందించారు.

పోలింగ్‌కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలానికి సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఎస్ఈసీ ఆదేశించారు. మద్యం విక్రయాల నిషేధం, ఎన్నికల ప్రచారంపై వర్తించే ఆంక్షలను ప్రజలకు, రాజకీయ పార్టీలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు పత్రికా ప్రకటనల ద్వారా నిబంధనలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికేతర రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిబంధనల ప్రకారం సంబంధిత పట్టణ స్థానిక సంస్థల పరిధిని విడిచివెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గెస్ట్ హౌస్‌లు, హోటళ్లు, కళ్యాణ మండపాల్లో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించాలని, అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభించి, రాత్రి 8 గంటల్లోగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ కార్యదర్శి డాక్టర్ ఏ.మల్లిఖార్జున సూచించారు. 12 గంటల వ్యవధిలో కౌంటింగ్ పూర్తి చేసేందుకు అవసరమైన కౌంటింగ్ టేబుళ్లు, అదనపు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అర్హులైన ఓటర్లందరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించాలని సూచించారు. అలాగే, పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి క్రెడెన్షియల్స్ వెరిఫికేషన్ పేరుతో ఎలాంటి అనవసర జాప్యం చేయరాదని, ఎన్నికల నిబంధనల ప్రకారం వారి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించరాదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అనవసర జాప్యం జరగకుండా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కౌంటింగ్ సిబ్బందికి ముందస్తు శిక్షణ అందించాలని సూచించారు.














Click it and Unblock the Notifications
