GST 2.0: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్ -ఏపీలో పెరిగిన వాహనాల అమ్మకాలు..!
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి అమల్లోకి తెచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావం అప్పుడే వివిధ రంగాలపై కనిపిస్తోంది. పలు రంగాల్లో భారీగా తగ్గిన పన్ను రేట్ల కారణంగా విక్రయాలు కూడా అంతే స్ధాయిలో పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఏపీలోనూ వాహన విక్రయాలు భారీగా జరుగుతున్నట్లు ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో కొత్తగా అమలవుతున్న జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ సోమవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 2,991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందాయని పేర్కొన్నారు. వీటిలో మోటార్ సైకిళ్లు 2,352, కార్లు/క్యాబ్‌లు 241, ట్రాక్టర్లు 60, ఆటోలు 227, గూడ్స్ వాహనాలు 47, ఆటో గూడ్స్ వాహనాలు 50, ఇతర వాహనాలు 12 ఉన్నాయని ఆయన వెల్లడించారు.

జీఎస్టీ 2.0 కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ వేగం పెరుగుతుందని త్వరలోనే రోజుకు 4,000 వాహనాల రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇందుకు తగినట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీఎస్టీ 2.0 సంస్కరణల్ని పూర్తి స్దాయిలో స్వాగతించిన ఎన్డీయే ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ వీటిపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనుంది. వీటికి ముందే అసెంబ్లీలో జీఎస్టీ 2.0ను స్వాగతిస్తూ ఓ తీర్మానాన్ని కూడా ప్రభుత్వం ఆమోదించింది.












Click it and Unblock the Notifications